- బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడ్తం
- ఉలెన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ కూడా ఇస్తం
- దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలలో చదివే బీసీలకు
- ఫీజు రీయింబర్స్మెంట్ఇందు కోసం రూ. 150 కోట్లు కేటాయించినట్లు వెల్లడి
కరీంనగర్, వెలుగు: బీసీ స్టూడెంట్లకు ఇస్తున్న స్కాలర్షిప్ లన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఒకే స్కీమ్‌గా అమలు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ స్కీమ్‌కు బడుగుల విద్యాప్రదాత కేసీఆర్ పేరు వచ్చేలా నామ కరణం చేస్తం” అని ఆయన తెలిపారు. జాతీయ విద్యా సంస్థల్లో చేరిన ఇక్కడి బీసీ స్టూడెంట్లకు రీయింబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు సకల సౌకర్యాల్లాంటి అంశాలపై విధివిధానాలను ఖరారు చేసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలతో సమావేశం నిర్వ హించనున్నట్లు వెల్లడించారు.
అదేరోజు జీవో విడుదల చేయడంతోపాటు స్కీమ్‌కు సంబంధించిన లోగోను కూడా విడుదల చేస్తామని చెప్పారు. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చేరే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 302 బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో అడ్మిషన్ పొందిన స్టూడెంట్లకు సన్నబియ్యంతో భోజనం పెట్టబోతున్నామన్నారు. ఉలన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ , నెలనెలా కాస్మోటిక్ చార్జీలను ఇస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో 34 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
దేశంలోని ఐఐటీల్లో చదివే మనోళ్ల కోసం రూ. 150 కోట్లు
ఉమ్మడి ఏపీలో తెలంగాణలో 19 గురుకులాలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాటి సంఖ్య 327కు పెరిగిందని మంత్రి గంగుల చెప్పారు. దీంతో 1,87,320 మంది విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతున్నదన్నారు. ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐఎంలు, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీల్లాంటి 200 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందిన తెలంగాణ బీసీ బిడ్డల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని చెప్పారు. ఇందుకోసం రూ.150 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, విద్యా ర్థుల సంఖ్య పెరిగితే బడ్జెట్‌ను పెంచుతామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన బీసీ స్టూడెంట్లకు మహాత్మాజ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షల వరకు సాయం అందిస్తున్నట్లు తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి వంటి పథకాల్లో మెజార్టీ వాటా బీసీలకే దక్కుతున్నదన్నారు. కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువైన స్థలాల్లో 42 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మించడంతోపాటు కులవృత్తుల పునర్వైభవనానికి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వివరించారు. .