వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది జాతీయ రాజకీయాల్లోకి..
కొందరు ఎమ్మెల్సీలు కూడా హస్తినకే
పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో ఈ మేరకు సంకేతాలు ఇవ్వనున్న కేసీఆర్
హైదరాబాద్, వెలుగు : టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్..తన కేబినెట్ సహచరుల్లో ఎక్కువ మందిని లోక్ సభ ఎన్నికల బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. కొందరు ఎమ్మెల్సీలను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించనున్నారు. ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేతను తగ్గించడానికి కొందరిని అసెంబ్లీ పోల్స్ నుంచి డ్రాప్ చేసి పార్లమెంట్ కు పంపడమే ఉత్తమమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈనెల 27న నిర్వహించే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో గులాబీ బాస్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో కేసీఆర్ సహా 17 మంది ఉండగా ఇందులో తొమ్మిది నుంచి పది మంది లోక్ సభకు పోటీ చేయడం ఖాయమనే చర్చ సాగుతోంది.
మండలి సభ్యుల్లోని కొందరు సీనియర్లను సైతం తన వెంట హస్తిన తీసుకెళ్లడానికే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ నెలాఖరులోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ ఎన్నికల్లో పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీకి నెలన్నర, రెండు నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశముందని ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చెప్పారు.
బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కారు పార్టీపై క్రమేణ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడమే తమకు పెద్ద ఎసెట్ అని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు ఎదురు కావొచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల చేయించిన వరుస సర్వే నివేదికలు సైతం ఇదే తరహా ఇండికేషన్స్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలున్నాయి.
ఫ్రెండ్లీ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ మినహా మిగతా 16 సీట్లలో బలమైన అభ్యర్థులను పోటీకి దించడంపై కేసీఆర్ దృష్టి సారించారు. దూకుడు మీదున్న బీజేపీ, కాంగ్రెస్ లకు పార్లమెంట్ ఎన్నికల్లో చెక్ పెట్టాలంటే సీనియర్లతో పాటు కాస్త బలమైన నేతలనే ఎంపీలుగా పోటీకి దించాలని చూస్తున్నారు. ఈక్రమంలోనే తనతో సహా తొమ్మిది మంది మంత్రులను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం చేయించడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఎంపీలుగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు రంజిత్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించవచ్చని తెలుస్తోంది.
ఎమ్మెల్సీల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులను ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటివరకు గులాబీ పార్టీ సికింద్రాబాద్ , మల్కాజిగిరి, నల్గొండ ఎంపీ స్థానాల్లో విజయం సాధించలేదు. ఈ మూడు సీట్ల నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులనే పోటీ చేయించబోతున్నాననే క్లియర్ కట్ ఇండికేషన్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో కేసీఆర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.