
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 20) ఉదయం ఏఐజీకి వెళ్లారు. ఆసుపత్రికి ఆయన సతీమణితో కలిసి వెళ్లారు.
అమెరికా వెళ్లాలలనే యోచనలో ఉన్న కేసీఆర్.. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏఐజీ హాస్పటల్ కు వెళ్లారు. అదే విధంగా పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకునేందుకు
నిన్న (బుధవారం) సికింద్రాబాద్ రీజినల్ పాస్ పోర్టు ఆఫీస్ కు వెళ్లారు.
మనుమరాలు అలేఖ్యకు అమెరికాలో సీటు రావడంతో ఆయన అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే తన పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్నారని, డిప్లమాట్ పాస్ పోర్టును సాధారణ స్థితికి మార్చుకున్నారనే టాక్ ఉంది. అయితే మొన్నటి వరకు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కొడుకు హిమాన్షు ప్రస్తుతం సింగపూర్ విద్యాభ్యాసం చేస్తున్నారు. తాత మీద బెంగతో పదే పదే ఇండియా వస్తుండటంతో అమెరికా నుంచి సింగపూర్ కు షిప్ట్ చేయించారని తెలుస్తోంది.
ఈ క్రమంలో మనుమడి వద్ద కొంత కాలం గడిపేందుకు సింగపూర్ కు వెళ్తారని అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ఫారిన్ టూర్ పక్కా అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ పాస్ పోర్టు రెన్యూవల్ కొత్త చర్చకు తెర తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి పార్టీ బాధ్యతలను మరికొంత కాలం కేటీఆరే చూసుకునే అవకాశం ఉంది.