కేసీఆర్ కిట్ పథకం క్షేత్రస్థాయిలో అమలు కావట్లే

  •     సీకేఎంలో 17,242 మందికి పెండింగ్
  •     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాఇదే పరిస్థితి

వరంగల్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఈ పథకాన్ని గొప్పగా చెప్పే ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ కిట్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే ప్రోత్సాహక సాయం కూడా ఇవ్వడం లేదు. దీంతో డెలివరీల కోసం గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్లేవారు నిరాశకు గురవుతున్నారు. డెలివరీలు పూర్తి చేసుకున్న బాలింతలు ఏండ్ల తరబడి కేసీఆర్ కిట్, నగదు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క వరంగల్ సీకేఎం ఆసుపత్రిలోనే 17,242 మందికి కేసీఆర్ కిట్ అందాల్సి ఉంది.

భారీగా పెండింగ్..

వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సగటున ప్రతినెలా 600 నుంచి 700 ప్రసవాలు జరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ నుంచి ఈ హాస్పిటల్​ లో డెలివరీ అయిన తల్లులకు ప్రోత్సాహక డబ్బులు ఇవ్వడం బంద్‍ చేశారు.  2020లో 4990 మంది, 2021లో 6393 మంది, 2022 జనవరి నుంచి నవంబర్​వరకు 5864 మందికి డెలివరీలు పూర్తి కాగా వీరికి కేసీఆర్ కిట్, ప్రోత్సాహక సాయం అందలేదు. సీకేఎం మాత్రమే కాక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. చాలాచోట్ల ఈ పథకం అమలు కావడం లేదు.

డబ్బులు కూడా పడట్లే...

రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్ 4న కేసీఆర్‍ కిట్​పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రూ.2వేలు విలువ చేసే కిట్ అందిస్తోంది. ఇందులో బేబీకి అవసరమయ్యే ప్రతి వస్తువూ ఉంటుంది. కిట్ తో పాటు మహిళలు గర్భం దాల్చాక కూలి పనులకు వెళ్లకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహం అందిస్తున్నాయి. 
కేంద్రం రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.6వేలు కలిపి మొత్తం రూ.12వేలు గర్భిణుల ఖాతాల్లో జమచేస్తుంది.

ఆడ పిల్ల పుడితే మరో రూ. వెయ్యి అదనంగా అందిస్తోంది. గర్భం దాల్చింది మొదలు నాలుగు విడతలుగా ఈ నగదు పంపిణీ చేస్తోంది. అయితే గడిచిన రెండేళ్లల్లో చాలామందికి ఈ డబ్బులు వేయడం లేదు. డెలివరీ సమయానికి రూ.8వేలు రావాల్సి ఉండగా.. రెండో సంతానం అయ్యేవరకు కూడా అవి అకౌంట్లలో పడడం లేదు. దీంతో బాధితులపై ఆర్థిక భారం పడుతోంది. ఉచితంగా డెలివరీలు చేస్తున్నా, ట్రాన్స్ పోర్ట్, మెడిసిన్ ఇతర ఖర్చులకు అదనంగా డబ్బులు అవసరం పడుతున్నాయి.

రిపోర్ట్ పంపిస్తున్నం

ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీ కోసం వస్తున్న గర్భిణుల వివరాలు ఆశా, ఏఎన్ఎంల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు  ప్రభుత్వానికి పంపిస్తున్నాం. గర్భిణుల బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సమర్పిస్తున్నాం.ఇక్కడివరకు మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వమే చూసుకుంటుంది. – వెంకటరమణ, డీఎంహెవో, వరంగల్