కాంగ్రెస్లో డ‌జ‌న్ మంది ముఖ్యమంత్రులు :  ప్రజా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ 

కాంగ్రెస్లో డ‌జ‌న్ మంది ముఖ్యమంత్రులు :  ప్రజా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ 

ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. నాయకులు కాదు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్లముందు జరిగిన చరిత్రను కూడా కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టాల్సిన ప్రాంతంలో కట్టలేదని, ఏళేశ్వరం ప్రాంతంలో కట్టాల్సి ఉండేదన్నారు. అనాడు నోరు మూసుకుని కూర్చున్నది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అని చెప్పారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ నాయకులే అన్నారు. అనాడు కాంగ్రెస్ నాయకులు నీళ్లు, కరెంటు కోసం కొట్లాడలేదన్నారు.పదవులు వస్తే చాలనుకున్నారని చెప్పారు. 

గులాబీజెండా వచ్చాక బీఆర్ఎస్ వాళ్లే కొట్లాడారని.. నీళ్ల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్. పదవులు, కాంట్రాక్టులు వస్తే ముఖ్యమనుకున్నారని ఆరోపించారు. అనాడు తెలంగాణ కోసం కాంగ్రెస్ కు చెందిన ఏ ఒక్కరైనా రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. హుజుర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 

రైతుబంధు అనే పదాన్ని ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అని చెప్పారు. రైతుబంధు మంచిది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఉంచాలా..? తీసేయాలా..? అని ప్రశ్నించారు. ధరణి ఉంచాలా...? తీసేయాలా..? అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రాహుల్​గాంధీకి ఏం తెలుసని ధరణి వద్దంటున్నారని ప్రశ్నించారు. ఇవాళ వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. రైతులకు 3 గంటలు కరెంటు సరిపోతుందా...? అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ తీసేస్తే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయి...? అని అడిగారు. 

కాంగ్రెస్ పార్టీలో డ‌జ‌న్ మంది ముఖ్యమంత్రులు ఉన్నార‌ని సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. ప్రతి ఒక్కరూ న‌న్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రి అయితా అంటున్నారని, అస‌లు కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేదన్నారు. పార్టీల త‌ర‌పున నిల‌బ‌డే వ్యక్తుల‌నే కాదు.. ఆ పార్టీల నైజం, ధృక్పథం గురించి తెలుసుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక క‌ష్టాలు ప‌డ్డామని,  ఇవాళ అన్ని స‌మ‌స్యల‌ను అధిగ‌మించుకున్నామని చెప్పారు. గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకున్నామని,  వారి హ‌క్కుల‌ను కాపాడినం అని చెప్పారు.