ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించాలని, మన అవసరాలు చెప్పి మాకు ఇంత వాటా రావాలని కొట్లాడాలని కేసీఆర్ అన్నారు. ‘‘మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే మన జీవితాలను దెబ్బకొట్టేలా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించింది. జలాల్లో వాటా అడక్కుండా ప్రభుత్వం సంతకం పెట్టింది” అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ‘‘దీనివల్ల జరిగే నష్టం హరీశ్‌రావుకు తెలుసు కాబట్టి ఆయన గర్జించారు. దీంతో మీరు నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుందామని ‘చలో నల్గొండ’కు పిలుపునిచ్చాను. దీంతో పీక్క చస్తున్నారు.
ఇజ్జతిమానం పోతుందని, ఏం చేయాలని చేతులు కాళ్లు పిసుక్కొని, ఆగమాగమై బడ్జెట్ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అదికూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు. తెలివి తక్కువ తీర్మానం పెట్టి మమ అనిపించారు’’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రమే బాగుందని మంత్రి ఉత్తమ్ అన్నారని, అదే మంచిగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు, పైరవీలు కావాలి కానీ ప్రజల హక్కుల గురించి పట్టించుకోరన్నారు. మనకు జరిగే అన్యాయంపై అవసరమైనప్పుడు పోరాడాలని, అవసరమైతే సద్దులు కట్టుకుని రావాలన్నారు. ఉవ్వెత్తున ఉద్యమంలా ఎగసి పడకపోతే ఎవరూ మనల్ని రక్షించేందుకు రారని చెప్పారు. నాడు ఫ్లోరైడ్ సమస్యపై పోరాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు.
పనులు చెయ్యకుంటే నిలదీస్తం..
‘‘చలో నల్గొండ అంటే కేసీఆర్‌ను తిరగనీయమని కాంగ్రెసోళ్లు సవాల్ చేస్తున్నరు. కేసీఆర్‌నే తిరగనీయనంత మొగోళ్లా.. ఏమి చేస్తరు చంపేస్తరా?’’ అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ను చంపి మీరుంటరా? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజా సమస్యలను అడుగుతది. మీకు దమ్ముంటే చెప్పిన దానికంటే మంచిగా చేసి చూపియ్యాలె’’ అని అన్నారు. దమ్ముంటే పాలమూరు ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయాలని.. పేద పిల్లలకు గురుకులాలు పెంచాలని, కరెంట్ మంచిగా ఇయ్యాలని సవాల్ చేశారు.
ఇవన్నీ వదిలేసి బలాదూర్‌గా తిరుగుదామనుకుంటే తిరగనీయమని, తప్పకుండా నిలదీస్తామని చెప్పారు. కొత్త గవర్నమెంట్ వస్తే పోయిన గవర్నమెంట్ కంటే మంచి పనులు చేయాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి సొల్లు పురాణం, కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలా అని చూస్తున్నదని విమర్శించారు.