కాంగ్రెస్ పాలనలో ఏండ్లుగా గోస పడ్డాం : కేసీఆర్

మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు స్వయానా రైతు.. ఆయ‌న రైతుల బాధ‌లు తెలిసిన వ్యక్తి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏం చేసినా న్యాయంగా, ఇమాందారీగా చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటన్నారు. నాయ‌కులు చాలా మంది ఉంటారు.. ఎమ్మెల్యేలు చాలా మంది అయ్యారు.. కానీ, భాస్కర్ రావు ఇన్నేండ్లలో ఏ ఒక్క రోజూ కూడా తన వ్యక్తిగ‌త‌మైన ప‌నులు తనను అడ‌గలేదన్నారు. మిర్యాల‌గూడ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 

మిర్యాల‌గూడ ప‌ట్టణాభివృద్ధి, తండాల అభివృద్ధి, సాగునీటి స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం, పారిశ్రామిక వాడ కోసం ప‌ట్టుబ‌ట్టారు కేసీఆర్ చెప్పారు. భాస్కర్ రావు రైతుల బాధ‌లు తెలిసిన వ్యక్తి అని చెప్పారు. పంట‌ల‌ను వేసిన‌ప్పటి నుంచి మార్కెటింగ్ చేసే దాకా రైతుల‌కు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నార‌ని కేసీఆర్ చెప్పారు. ఓట్లు వేసే వాళ్లు వ్యక్తిని చూడాలని, పార్టీ చరిత్ర, ధృక్పథం గురించి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజాశక్తి గెలవాలని సూచించారు. 

మిర్యాల‌గూడ‌లో ఆరున్నర కోట్లు పెట్టి కేసీఆర్ క‌ళాభార‌తి కట్టిన‌ట్లు భాస్కర్ రావు తనకు తెలిపార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. సంస్కృతి, క‌ళ‌లు ఉండే ప్రాంతం కాబ‌ట్టి.. క‌ళాభార‌తి బిల్డింగే భాస్కర్ రావు మైండ్ కు ద‌ర్పణం ప‌డుతుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదన్నారు. కాంగ్రెస్ స‌వ్యంగా ప‌రిపాల‌న చేసి ఉంటే.. మిర్యాల‌గూడ‌లో చివ‌రి కాలువ‌ల కోసం ఉద్యమం జ‌రిగేది కాదని చెప్పారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు, పంట‌లు ఎక్కువ కాబ‌ట్టి.. ఒక అల‌జ‌డి ఉండేదన్నారు.  నీళ్ల కోసం ఉద్యమం జ‌రిగేదని.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు కేసీఆర్.

శాశ్వతంగా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలు తీరేలా కృషి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు రైతు బంధు ఇస్తే దుబారా అవుతుందా..? కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల పాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కర్నాటకలో ఇప్పుడు ఐదు గంటల పాటే కరెంటు ఇస్తున్నారని చెప్పారు. డీకే శివకుమార్ ఐదు గంటల పాటు కరెంటు ఇస్తున్నామని చెప్పాడని, ఇక్కడ 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామననారు. అలా చెప్పడానికి డీకే శివకుమార్ కు కనీసం సిగ్గు ఉండాలె అని మండిపడ్డారు. 

ఎన్నో ఏండ్లుగా దళిత జాతి వివక్షకు గురవుతోందన్నారు. దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని చెప్పారు. అందుకే దళితుల కోసం దళితబంధు పుట్టించిందే కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏండ్లుగా గోస పడ్డామన్నారు. రైతుల కష్టాలను తీర్చాలని గతంలో ఏ పార్టీ కూడా ఆలోచన చేయలేదన్నారు. ఈసారి భాస్కర్ రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని.. తప్పకుండా ఇక్కడి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఏండ్లుగా గోస పడ్డామన్నారు. గతంలో గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదని, ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దామని చెప్పారు. 

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ ఇవాళ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. గత పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తోందన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. మత కల్లోలం లేదు.. శాంతియుతంగా రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ దుర్మార్గులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని, భగవంతుడి దయవల్ల ఆయనకు ఏమీ కాలేదన్నారు. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లి.. ట్రీట్ మెంట్ అందిస్తున్నామని చెప్పారు. తాము ఏనడూ అరాచకం చేయలేదని, పదేళ్లలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజలకు మంచే చేశామన్నారు. దుర్మార్గాలు, దౌర్జాన్యాలు చేయలేదన్నారు.