వైద్య రంగానికి మహర్దశ : ఇంద్రకరణ్​ రెడ్డి

  • మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
  • ఆసిఫాబాద్​లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
  • ఏపీ, మహారాష్ట్రలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని వ్యాఖ్య
  • కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే మోసపోతారన్న మంత్రి

 నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు ఆసిఫాబాద్​లోని అంకుసాపూర్​లో ఏర్పాటైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను శుక్రవారం సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. నిర్మల్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకముందు మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్య ఉద్యోగులు, సిబ్బంది, యువజన సంఘాలు సభ్యులు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి డోలు వాయించి ఈ ర్యాలీని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా దివ్య గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంద్రకరణ్​ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య రంగానికి మహర్దశ రానుందని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కృషితోనే జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రసాద్, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదివరకున్నవి దరిద్రపు ప్రభుత్వాలు: 

మల్లారెడ్డి ఆసిఫాబాద్/ కాగజ్ నగర్: ఇంతకు ముందున్న ప్రభుత్వాలు దరిద్రపుగొట్టువని, సీఎం కేసీఆర్ లాగా ప్రజల కోసం ఆలోచించే సీఎం దేశంలో  ఏ రాష్ట్రంలోనూ లేరని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆసిఫాబాద్ లోని అంకుసాపూర్ మెడికల్ కాలేజీ ప్రారంభానికి మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. ఎప్పట్లాగే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ను పొగడ్తలతో ముంచెత్తుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ కనీసం తాగు నీళ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, దొంగ అని ఆరోపించారు. బీజేపీ డ్రమా బాజీ చేస్తోందని, ఈ రెండు పార్టీలను నమ్మి ఓటేస్తే మోసపోయినట్టేనని వ్యాఖ్యానించారు. 

ఇక్క అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు. వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లా వంటి ప్రాంతానికి  సమీకృత కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పక్కనున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​లో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ హేమంత్ బోర్కడే, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, అదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగార్జున చారి పాల్గొన్నారు.

ALSO READ: రూపాయి కూడా ఇయ్యలే..అల్లాజీ అంత్యక్రియలు పూర్తి

ప్రారంభోత్సవానికి వచ్చిన  మాజీ జడ్పీటీసీకి గుండెపోటు
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ లోని మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండెపోటుతో మృతి చెందారు. జిల్లాలోని రెబ్బెన మండల మాజీ జడ్పీటీసీ కర్నాథం చంద్రయ్య(60) శుక్రవారం ఉదయం తన అనుచరులు, నాయకులతో కలిసి వాహనంలో బయల్దేరి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఓ హోటల్ దగ్గర ఆగి టీ తాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. హార్ట్ ఎటాక్ వచ్చినట్లు గుర్తించిన డాక్టర్లు మెరుగైన ట్రీట్​మెంట్ కోసం మంచిర్యాల కు రిఫర్ చేశారు. మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో బెల్లంపల్లి సమీపంలో చంద్రయ్య మృతి చెందారు. 

ఆసిఫాబాద్, వెలుగు