ఫామ్​హౌస్​లో కూర్చొని ప్రగల్భాలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఫామ్​హౌస్​లో కూర్చొని ప్రగల్భాలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్​ తీరు మారలేదు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతోనే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఛీ కొట్టినా కేసీఆర్ వ్యవహార శైలి, మాట తీరులో మారలేదన్నారు. తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన కోరుకోవడం లేదని, ప్రజా పాలనను, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. 

పదేండ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని, ఏడాది కాంగ్రెస్ పాలనలోనే సాధించామని చెప్పారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూరుకుపోయిన కేసీఆర్ కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతోనే దాన్ని పక్కదారి పట్టించేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఫామ్ హౌస్ లో ఉండి పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్, కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి భంగపాటు తప్పదన్నారు.

కేసీఆర్ మైండ్ బ్లాక్: ఆది శ్రీనివాస్

కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణునిలా ఫామ్ హౌస్ లో పండుకొని.. లోకల్ బాడీ ఎన్నికలు రాగానే బయటకు వస్తానని అంటున్నరని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పోకిరిలో మహేశ్ బాబు డైలాగ్ లా.. సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించమని అవకాశం ఇచ్చినా కేసీఆర్ దాన్ని కాపాడుకోవడం లేదని విమర్శించారు. కైలాసంలో పెద్ద పాములా కేసీఆర్.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. దుబాయ్ వేదికగా బీఆర్ఎస్ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని నడిపిస్తుందని ఆరోపించారు.