మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఆపడం ఎవరి తరం కాదు: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్

మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఆపడం ఎవరి తరం కాదు: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్

వరంగల్: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆపడం ఎవరి తరం కాదని వరంగల్ ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోలీసులకు చెబుతున్నానని, డైరీల్లో రాసుకోండని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇప్పటి నుంచి తాను బయటకు వస్తానని, అందరి తరపున పోరాడతానని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని మండిపడ్డారు. 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటూ సంచులు మోస్తుందని దుయ్యబట్టారు. 20-30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా కాంట్రాక్టర్లే చెప్పారని సభలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం తనను చేయమంటున్నరని, ‘‘కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవ్’’ అని ఇప్పుడు అంటున్నరని సభకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని, సాధించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ వైఖరి అంతా భభ్రజమానం.. భజగోవిందం అని ఎద్దేవా చేశారు. శుష్కప్రియాలు.. శూన్యహస్తాలని బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ విమర్శలు చేశారు.

ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నరని, ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని కేసీఆర్ చెప్పారు. ప్రజలపై కేసులు పెడుతున్న పోలీసులు గుర్తుంచుకోవాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఆపడం ఎవరి తరం కాదని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.