- పంటలు మునగకుండా కరకట్ట కడతానంటున్న కేటీఆర్.. ఇన్ని రోజులు ఏం చేసిండు?
- బాధిత రైతులకు బాల్క సుమన్ పరిహారం ఇప్పించలేదని ఫైర్
- 49 వేల ఓట్ల మెజార్టీతో వివేక్ గెలుస్తరు: తీన్మార్ మల్లన్న
కోల్‌బెల్ట్, వెలుగు : తెలంగాణను పదేండ్లుగా కేసీఆర్ మోసం చేశారని, కాళేశ్వరం కట్టి కమీషన్ల ద్వారా లక్ష కోట్లు దోచుకున్నారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ‘‘కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీకే ఉద్యోగాలు దక్కాయి. కొలువులు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ పట్టించుకోలేదు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మేడిగడ్డకు తీసుకెళ్లి లక్ష కోట్లు దోచుకున్నడు. కాళేశ్వరం రీడిజైన్ వల్ల చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు బ్యాక్ వాటర్ లో మునిగాయి. మూడేండ్లుగా రైతులు నష్టపోతున్నా బాల్క సుమన్ పరిహారం ఇప్పించలేదు. కనీసం రైతులను పరామర్శించలేదు” అని వివేక్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కట్టి తప్పు చేశామని కేటీఆర్ ఒప్పుకున్నారని, అందుకే పంటలు మునగకుండా కరకట్ట కడతామని చెబుతున్నారని.. మరి ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై, లిక్కర్ కేసులో కవితపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బీజేపీ పట్టించుకోలేదు. మనీశ్ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు కవితను ఎందుకు అరెస్టు చేయలేదు” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్‌ను జైలుకు పంపిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరితే బట్టలిప్పి కొడ్తానన్న సుమన్‌ను ఈ నెల 30న జనమే బట్టలిప్పి కొడతారని అన్నారు.
బాల్క సుమన్ బట్టలు సర్దుకున్నడు : తీన్మార్ మల్లన్న
చెన్నూరులో కేసీఆర్‌కు, వివేక్ వెంకటస్వామికి మధ్యే పోటీ జరుగుతోందని.. బాల్క సుమన్ కు ఆ స్థాయి లేదని తీన్మార్ మల్లన్న అన్నారు. కేటీఆర్, కేసీఆర్ గెలుపుకే గ్యారంటీ లేదని.. అలాంటోళ్లు చెన్నూరులో సుమన్‌ను గెలిపిస్తారా? అని ఎద్దేవా చేశారు. చెన్నూరులో నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదుగానీ, వైన్స్ మాత్రం 10 గంటలకే తెరుస్తున్నారన్నారు. ‘‘చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ అంటున్నారు. చాలామంది బిడ్డలు చావు నోట్లో తల పెట్టి.. వాపస్ రాలేదు. మరి కేసీఆర్ ఎట్ల వాపస్ వచ్చారు” అని ప్రశ్నించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు గానీ, వైన్స్ టెండర్లకు నోటిఫికేషన్లు ఇచ్చి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే. వివేక్ వేంకటస్వామికి ఓటు వేస్తే తల్లి సోనియా గాంధీకి వేసినట్టు. తెలంగాణ సాధన కోసం పార్లమెంట్ మెట్ల మీద కూర్చొని పోరాడిన వివేక్.. ప్రజాసేవ చేసేందుకు చెన్నూరు బరిలో నిలిచారు. ఆయన గెలిస్తే రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది” అని అన్నారు. ‘‘బాల్క సుమన్ ఓటమి ఖాయమైంది. లారీలో బట్టలు సర్దుకుని మెట్పల్లి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. చెన్నూరులో వివేక్ వెంకటస్వామి 49 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మా టీమ్ సర్వేలో తేలింది” అని చెప్పారు. రోడ్ షోలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, హైకోర్టు అడ్వకేట్ శరత్, ఉస్మానియా జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్ పాల్గొన్నారు.