సిట్టింగ్​లందరికి టిక్కెట్లు సాధ్యమేనా?

పార్టీ  సిట్టింగ్​ ఎమ్మెల్యేందరికీ టెక్కెట్లు ఇస్తానని, భవిష్యత్​గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో  టీఆర్​ఎస్​ పార్టీ చీఫ్​ సీఎం కేసీఆర్​కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగా, పార్టీ అధినేత ఇప్పుడీ ప్రకటన ఎందుకు చేశారు? ఆయన సిట్టింగులకు ఇచ్చిన హామీ నిజంగా అమలు సాధ్యమేనా? కేసీఆర్​ఈ ప్రకటన మునుగోడు ఫలితం తర్వాత చేశారు. ఇక్కడ కారు పార్టీ గెలిచినప్పటికీ, బీజేపీకి పడిన ఓట్ల శాతాన్ని తక్కువగా తీసేయడానికి లేదు. గట్టి పోటీ ఇచ్చి.. చివరకు గెలిచినంత పని చేసింది.  ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత దృష్ట్యా చాలా మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఫిరాయించే అవకాశం ఉన్నందున ‘సిట్టింగులందరికీ టెక్కెట్లు పక్కా’ అనే ప్రకటన ఇవ్వడం ఇప్పుడు అత్యవసరమని కేసీఆర్‌‌కు తెలుసు. మునుగోడులో స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ప్రజా వ్యతిరేకత బాగానే కనిపించింది. ఇప్పటికిప్పుడు అయిదారు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి?  అందుకే టిక్కెట్లపై ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. 

కేసీఆర్ ​వ్యూహం

ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం అతనికి సమాజ గౌరవం లభిస్తుంది. ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే అవుతాడో అప్పటి నుంచి ప్రజా క్షేత్రంనుంచి కనుమరుగు కావాల్సిందే. విస్తృతంగా సేవ చేస్తే తప్ప ప్రజల మన్ననలు పొందలేడు. తనకు టిక్కెట్​ఖాయం అనుకునే, ప్రజలు గెలిపించగలరనే పార్టీలోనే చివరి వరకు కొనసాగుతారు. ఎమ్మెల్యేలందరి కంటే కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి.  సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలకే టిక్కెట్‌‌ ఇస్తామని ఆయన ప్రకటన చేయడం వెనుక కారణాలు ఉన్నాయి. తమకు టిక్కెట్​రాదు అని భావించే ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయడమో, పార్టీ మారడమో సహజం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఆర్​ఎస్​ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడు లాంటి మరో ఉప ఎన్నిక భారం పార్టీకి తప్పదు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే,  కేసీఆర్​బలం తగ్గిందనో, వ్యతిరేకత పెరిగిందనో ప్రచారాలు ఊపందుకుంటాయి. పత్రికల బ్యానర్​హెడ్డింగుల్లో, టీవీల హెడ్​లైన్స్​లో రాజీనామాల అంశం బాగా విస్తరిస్తుందని కేసీఆర్​కు తెలుసు.

కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు వస్తాయని కేసీఆర్​హామీ ఇచ్చి ఆ ప్రవాహాన్ని ఆపారు. బయటకు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా, మొన్నటి కేసీఆర్ ​ప్రకటనతో ఏం నిర్ణయం తీసుకోవాలో గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. టిక్కెట్లు వస్తాయనే ధీమాతోనే వారు చివరి వరకు కొనసాగవచ్చు. అలాంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు చాలా విధేయతతో వ్యవహరిస్తారు. 104 మంది టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది తనను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపిస్తారని కేసీఆర్‌‌కు తెలుసు. అలాంటి వారిని గుర్తించినా.. ఇప్పుడే వదులుకుంటే పార్టీకి నష్టం. అందుకే ఆయన ఆచితూచి ‘సిట్టింగులకు టిక్కెట్టు ఖాయం’ అనే ప్రకటన చేశారు. ఇదీగాక కొత్తగా మిత్రులైన ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగిస్తే.. వాటి ప్రాభవం ఎక్కువగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని సీట్లు వారికి కేటాయించాల్సిందే! అప్పుడు ఏ సిట్టింగ్​ఎమ్మెల్యేకు ఎసరు పెట్టాల్సి వస్తుందో తెలియదు.

ముందున్న అవకాశాలు - అవరోధాలు

కేసీఆర్ తెలంగాణలో రెండు విరుద్ధ ప్రధాన ప్రతిపక్షాలను ఎదుర్కొంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతపరంగా ఎప్పకటీ ఒక్కటయ్యే అవకాశం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తానని హామీ ఇవ్వడం ద్వారా, ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడే వరకు పార్టీలో తిరుగుబాటు ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక, కేసీఆర్ తనకు నచ్చింది చేస్తారు. అవసరమైతే పార్టీ మారిన, లేదా తిరుగుబాటు ఎమ్మెల్యేలను రాజకీయంగా ఫినిష్ చేస్తారు కూడా. ఇది ఒకరకంగా ఆయనకు అనుకూల అవకాశం కాగా, కొంత ప్రమాదమూ లేకపోలేదు. కేసీఆర్ ఇచ్చిన టిక్కెట్​హామీ ఉత్తదే అని, ఇది కాలాన్ని ముందుకు జరిపే వ్యవహారమని మెజార్టీ ఎమ్మెల్యేలు గ్రహిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. అలాంటి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, రాతపూర్వకంగా తమకు హామీ ఇవ్వాలని లేదా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్​ను డిమాండ్ చేస్తే.. అది ఆయనకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. 2011లో బెంగాల్​లో మమతా బెనర్జీ వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించే క్రమంలో విపరీతమైన సందడి చేశారు. అయినా ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యారు. ఇప్పుడు  కేసీఆర్​ది అలాంటి పరిస్థితే. పాలకుల వివాదాలు ప్రజలకు అంతగా నచ్చవు.

చరిత్ర ఏం చెబుతున్నది?

సిట్టింగ్ ​ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టిక్కెట్లు హామీ ఇచ్చిన పార్టీలు.. దాన్ని ఎంత వరకు అమలు చేస్తాయనేది సందేహమే! చరిత్రలో కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. 1952 నుంచి భారతదేశంలో 17 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కానీ ప్రతి ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎంపీల్లో 35 శాతం మంది మాత్రమే తిరిగి వస్తున్నారు. పార్లమెంటుకు జరిగే ప్రతి ఎన్నికల్లో దాదాపు 40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు దక్కకపోవడమో లేదా వారు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడమో జరుగుతున్నది. మిగతా 60 శాతంలో టిక్కెట్లు దక్కినా ఓడిపోయేవారే సగం మంది వరకు ఉంటారు. కాబట్టి ఎన్నికల తర్వాత ప్రతి కొత్త పార్లమెంటులో గరిష్టంగా 35 శాతం మంది సిట్టింగ్ ఎంపీలు మాత్రమే ఉంటున్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలకు కూడా ఇవే గణాంకాలు వర్తిస్తాయి.

దాదాపు 35 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే తిరిగి అసెంబ్లీకి రానున్నారు. తెలంగాణలో 104 మంది టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఓడిపోతారని కేసీఆర్‌‌కు తెలుసు. పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్​ కూడా ఆయన వద్ద ఉంది. కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ముందు చివరి నిమిషం వరకు వేచి చూసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రతి నాయకుడూ గెలుపు గుర్రాలనే కోరుకుంటాడు తప్ప, ఓడిపోయే, పార్టీకి నష్టం చేసే వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు ఇష్టపడడు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రజాభిమానం లేని ఎమ్మెల్యేల భారాన్ని మోస్తూ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాలేరు కదా? అందుకే ఆయన ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు.

అడగలేరు.. అడిగితే అవుట్?

ఓ ధనవంతుడు ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఎక్కడో సందేహం. డబ్బు నిజంగా ఇస్తారా? అని ఎవరైనా ధైర్యం చేసి అడిగితే.. నాపై నమ్మకం లేదా అని ప్రశ్నించిన వ్యక్తిని తిరస్కరిస్తాడు. సిట్టింగ్​ఎమ్మెల్యేల పరిస్థితి అచ్చం అలాంటిదే. వారు టెక్కెట్​హామీ గురించి కేసీఆర్‌‌ను ప్రశ్నించలేరు. ప్రశ్నించి పార్టీలో కొనసాగలేరు. అందుకే భవితవ్యం ఏమిటో తేలాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే. నామినేషన్ల చివరి రోజున తమకు టికెట్‌‌ వస్తుందా? లేక మోసపోతామా అనేది ఎమ్మెల్యేలే తేల్చుకోవాలి. చివరి సమయంలో ఒక ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించాలంటే ఆయన నియోజకవర్గం నుంచి కొంత మందిని దగ్గరకు తీసి ప్రజావ్యతిరేకతను చూపడం లాంటివి రాజకీయాల్లో ఎప్పుడూ జరిగేవే!

- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ​ఎనలిస్ట్