ఖమ్మం/కూసుమంచి, వెలుగు : పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెర్వులో శుక్రవారం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్పాల్గొననున్నారు. 90 ఎకరాల్లో మీటింగ్‌కోసం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఏర్పాట్లు పూర్తిచేశారు. సభకు లక్ష మందిని తరలించేలా ప్లాన్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరగుతున్న మొదటి సమావేశం బీఆర్ఎస్నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ సభకు పాలేరు నియోజకవర్గానికి సీఎం హోదాలో కేసీఆర్ రావడం ఇదే తొలిసారి. 2016లో భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, 2017లో ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డతండా దగ్గర జరిగిన సభకు కేసీఆర్ హాజరయ్యారు.
2014, 2018 ఎన్నికల సందర్భంగా జిల్లా పర్యటనకు వచ్చినా, పాలేరులో బహిరంగ సభ పెట్టలేదు. సభ ఏర్పాట్లను గురువారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్, కార్ల పార్కింగ్ కు సంబంధించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, కూసుమంచి సీఐ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎంతోపాటు జిల్లా మంత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, ఎమ్మల్సీ తాతా మధు హాజరుకానున్నారు.
బీఆర్ఎస్లో చేరిన 40 కుటుంబాలు
కూసుమంచి మండలం లాల్ సింగ్ తండా సర్పంచ్ ధారావత్ వెంకట్, ఉప సర్పంచ్ భూక్యా నీరజ-వీరన్న, వార్డు మెంబర్లు ధారావత్ హచ్చా, గుగులోత్ వసంత-శ్రీను సహా 40 కుటుంబాలు గురువారం బీఆర్ఎస్లో చేరాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సీపీఐ నాయకులు బాధావత్ నాగు, భూక్యా నర్సింహ బీఎర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచులు వెంకట్, శ్యాసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.