కళ్లలో కన్నీళ్లే మిగిలాయ్.. ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే: కేసీఆర్

కళ్లలో కన్నీళ్లే మిగిలాయ్.. ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అంటేనే వింతైన పాలన అని.. రాష్ట్రంలో మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని.. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉండాలని అన్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్రా స్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి.. ఆ తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

మంగళవారం (ఏప్రిల్ 1) ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‎లో కేసీఆర్ భేటీ అయ్యారు. ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం (ఏప్రిల్ 2) మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో సభ ప్రాంగణానికి భూమి పూజ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తు్న్నారని.. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలివస్తారని అన్నారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు.