- గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నడూ గైర్హాజరు కాలే: కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రజల పక్షాన ఉన్నట్టు ఎలా నమ్ముతారని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తీరు నచ్చకనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత ప్రజల తీర్పును గౌరవించి.. ప్రజల పక్షం ఉండి.. ప్రజల సమస్యలపై మాట్లాడాలన్నారు.
గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నడూ గైర్హాజరు కాలేదని తెలిపారు. కేసీఆర్ పార్లమెంటరీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. బీఆర్ఎస్హయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. భూ రికార్డుల పేరుతో రైతులను గత బీఆర్ఎస్ సర్కారు తీవ్ర ఇబ్బందులు పెట్టిందన్నారు. ధరణి సమస్యలపై ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ను కలవాలని ప్రయత్నిస్తే.. సమయం ఇవ్వలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహంపైనా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం నాన్ ముల్కీ గ్యోబ్యాక్తో మొదలైందని, మదన్ మోహన్ సారథ్యంలో చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి పేరుతో 12 ఎంపీలలో 11 ఎంపీలు గెలిచిందని గుర్తుచేశారు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో తమతో కలిసి పని చేశారని, టీడీపీలో చేరి మంత్రి అయ్యారని చెప్పారు. ఆ తర్వాత మంత్రి పదవి రానందుకు తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారని తెలిపారు. టీపీఎస్ తరహాలో 11 స్థానాలు గెలువలేదని, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదన్నారు. అధికారంలోకి వచ్చాక సిద్ధాంత పరంగా గాడితప్పి.. అధికారం నిలబెట్టుకోవడానికి పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీసేందుకు అనేక అనైతిక పద్ధతులు అవలంబించారని కోదండరెడ్డి విమర్శించారు.