ఆదిలాబాద్టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ బీసీ ఓటర్లను ఆకర్శించేలా కొత్త డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి క్రాంతి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ‘లక్ష.. భిక్ష’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. బీసీ అభివృద్ధి సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ.7 వేల కోట్లు ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం దాంట్లో ఇప్పటివరకు కనీసం రూ.200 కోట్లు ఖర్చు చేయలేదని అన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పిన హామీ సైతం మాటలకే పరిమితమైందన్నారు. దళితబంధు తరహాలో బీసీ బంధు అని చెప్పి బీసీలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూ.లక్ష పథకంతో మరోసారి బీసీల గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు గందె విజయ్, నరేష్ , తోకల సతీష్, మోహన్ అగర్వాల్, గన్నోజి, విజయ్, శివన్న, అశ్విన్, అనూప్, తదితరులు పాల్గొన్నారు.