ఏడాదిలో కేసిఆర్ ప్రజలకు ఇచ్చిందేమి లేదు?

ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రభుత్వం ఏర్పరచి ఏడాది పూర్తయింది. ఏ రంగంలోనూ చెప్పుకోదగ్గ మార్పు లేదు. 2014 ఎన్నికల వాగ్దానాలే అమలు కాకపోగా, ఇప్పుడు 2018 ఎన్నికల హామీలు కూడా తోడయ్యాయి.  నీళ్ళు, -నిధులు,- నియామకాలు, -ఆత్మగౌరవ పరిపాలన నినాదాలు ఎండమావిగానే ఉన్నాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కెసిఆర్…  అప్పుల తెలంగాణగా మార్చారు.  ఏడాది పాలనలో కనీసం పాస్​ మార్కులుకూడా రాలేదు.

భూమి గుండ్రంగా వున్నదనేది ఎంత నిజమో, కేసిఆర్ పాలనకూడా అంతే గుండ్రంగా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్​తో ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పుడెవరికీ జవాబుదారీతనం లేదు. కీలకమైన భూమి సమస్యలు, నిరుద్యోగం, కార్మిక సమస్యలను పరిష్కరించడం లేదు. రైతులు, యువకులు ఆగ్రహంతో వున్నారు. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం అందుకు నిదర్శనం. ఇంచు ఇంచుకూ భూ లెక్కలు తీస్తామన్న మాటని కేసిఆర్ నిలబెట్టుకోలేకపోయారు. భూ ప్రక్షాళన ప్రారంభంలో రెవెన్యూ ఉద్యోగులు అద్భుతంగా పనులు చేశారని కితాబిచ్చిన కేసిఆర్… చివరకు రెవెన్యూ డిపార్టుమెంట్ మొత్తం అవినీతి మయం అయ్యిందని తేల్చారు. ఆయన అవకాశవాద ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పటికీ భూములకు హద్దు రాళ్ళు లేకపోవడంతోనూ, రియల్ ఎస్టేట్ కన్నుపడటంతోనూ హత్యలు, దాడులు జరుగుతున్నాయి.

గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కొంతమేర సఫలీకృతమైనా, మిగతా ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ కెనాల్, సీతారామ ప్రాజెక్టు, నక్కలగండి, దుమ్ముగూడెం, శ్రీరాం వరద కాలువలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఇంటింటికీ మంచినీళ్లందించే మిషన్ భగీరథ పూర్తిస్థాయిలో మారుమూల గ్రామాలకు అందించలేకపోతోంది.  రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల్లోనూ రెండు లక్షలకు పైగా ఖాళీల భర్తీ అలాగే ఉండిపోయింది. పోలీసు డిపార్టుమెంట్​లో తప్ప మరెక్కడా ఖాళీలు నింపిన పాపాన పోలేదు. ఉద్యోగ ఖాళీల తెలంగాణగా మార్చేశారు.  ఇప్పటి వరకు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్​ లేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆరేళ్లలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయలేదు.

పోడు రైతులకు భూపట్టాలను గిరిజన గ్రామాల్లో కూర్చొని ఇప్పిస్తానన్న వాగ్దానం నెరవేరలేదు.

నిరుద్యోగ యువతకు భృతిగా నెలకు రూ. 3016 ఇస్తామని ముందస్తు ఎన్నికలలో ప్రచారం చేసుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అటకెక్కించింది.

డబుల్ బెడ్ రూము ఇళ్ళు, దళితులకు మూడెకరాలు ఊసే లేకుండాపోయింది.

యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. దుబ్బాకలో ఒక రైతు యూరియా క్యూ లైన్​లోనే గుండె పోటుతో మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

నాణ్యమైన విత్తనాల సరఫరా సాగడం లేదు.

లక్ష రూపాయల రైతు రుణమాఫీపై ఒక్క మాట అనటం లేదు.

రైతు బంధు పథకం డబ్బులు ఖరీఫ్​లోనే ఐదెకరాల లోపు అందాయి. ఆ పైబడి వున్న రైతులకు అందలేదు. నవంబర్​లో ముగిసిన రబీ సీజన్ రైతు బంధు డబ్బుల గురించి మాట్లాడటమే లేదు. కాకపోతే ఉప ఎన్నికలు జరిగిన హుజూర్ నగర్ నియోజకవర్గంలోమాత్రం పోలింగ్​కి ముందు రైతుల అకౌంట్లలో జమా చేసింది.

58 ఏళ్లు నిండిన వారందరికీ ఇప్పటి వరకు పెన్షన్​ దక్కడం లేదు.

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో నిధులు అందక  అభివృద్ధి పనులు సాగడం లేదు. కేరళ తరహాలో స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. –

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు పేరుతో అప్పులు తెచ్చి ఆ డబ్బు దుర్వినియోగం చేశారు.  రాష్ట్రానికి వివిధ పద్ధతులలో మూడు లక్షల కోట్లకు పైబడి అప్పులు తెచ్చి అప్పుల తెలంగాణగా మార్చేశారు.

ఆర్టీసి సమ్మె విచ్చినానికి కేసిఆర్ సామ, దాన, దండోపాయాలు ప్రయోగించినా కార్మికుల ఐకమత్యం ముందు కేసిఆర్ పన్నాగాలు చెల్లలేదు. 52 రోజుల సుదీర్ఘ సమ్మె తరువాత దిగిరాక తప్పలేదు. మసిపూసి మారేడు కాయలు అమ్మినట్లు కార్మికులపై వరాల జల్లులు అని ఒక తప్పుడు ప్రచారం చేయించుకున్నాడు.

రాష్ట్ర ఆదాయానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానంగా మారింది. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు జరిగిన అత్యాచారాలు కాని, హత్యలు కాని ఎక్కువ శాతం మద్యం మత్తులోనే జరుగుతున్నాయి.

– చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి