15 రోజులుగా కేసీఆర్ కనిపించట్లేదు, కేటీఆర్ మీదే అనుమానం: బండి సంజయ్

  • వెంటనే కేసీఆర్​ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలని కామెంట్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే అవకాశముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందని, తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూడా రానివ్వడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్ టిల్లు నాయకత్వంలో ఎన్నికలకు వెళితే డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందన్నారు. కరీంనగర్​లో బండి సంజయ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్15 రోజుల నుంచి బయటకు రావడం లేదని, కేటీఆర్ కేసీఆర్​ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అనే డౌటొస్తోందన్నారు. దయచేసి కేసీఆర్​ను బయటకు తీసుకొచ్చి ప్రెస్ తోనైనా మాట్లాడించాలని, తద్వారా తమకు కనిపించేలా చేయాలని కల్వకుంట్ల కుటుంబాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ప్రధాని రెండ్రోజుల పర్యటనలో తెలంగాణ అభివృద్ధికి రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణే తమ కుటుంబమని చెబుతున్న కేటీఆర్ ​దళితుడిని సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

మీ ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయి?

కేసీఆర్ సీఎం కాకముందు ఆయన కుటుంబం ఆస్తి ఎంత? సీఎం అయ్యాక ఎన్ని రెట్లు పెరిగిందో బహిరంగంగా వెల్లడించే దమ్ముందా? అని సంజయ్ ​సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురి అవినీతి బాగోతం బయటపెడితే తెలంగాణ పట్ల విషం చిమ్మినట్లా? అని ప్రశ్నించారు. ఏ పిచ్చి కుక్క కరిస్తే కేసీఆర్ 2009 ఎన్నికల ఫలితాలు రాకముందే పిలవని పేరంటానికి వెళ్లాడో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణను లూటీ చేస్తారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పట్ల చులకన భావంతో ఉందని, కరీంనగర్​లో మసీదుకు 8 ఎకరాలు కేటాయించి, మందిరానికి 5 ఎకరాలే ఎట్ల కేటాయిస్తారని ప్రశ్నించారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే కొందరు ముస్లిం పెద్దలతో కలిసి సంజయ్​కు ఓటేయొద్దని మాట్లాడిస్తారని, అయినా తాను భయపడనన్నారు. కరీంనగర్ లో బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ తో ఎంఐఎం కరీంనగర్ మొత్తాన్ని కబ్జా చేసి అరాచకాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరించారు.