బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత కేసీఆర్ తెలంగాణకు ఒక పెద్ద బహుమానం ప్రకటించారు. నేను కాళేశ్వరం కట్టి తెలంగాణకు మూడేండ్ల నుంచి నీళ్లు ఇస్తున్నాను. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ నీళ్లను మహారాష్ట్ర వాళ్లు బాబ్లీ వద్ద పంపులు పెట్టి ఎత్తిపోసుకొమ్మని నాందేడ్‌లో సెలవిచ్చారు. తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రను తెలంగాణకు ఒక బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నారు! తెలంగాణ మొత్తంలో ఏకైక పెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ). సమారు 90 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 1963లో పనులు ప్రారంభించి 1977లో ఆ ప్రాజెక్టు ఆవిష్కరించబడింది. ఇది పూర్తి గ్రావిటీ ప్రాజెక్టు. ఎత్తిపోతల ప్రాజెక్టుకాదు. కరెంటు ఖర్చు అసలే లేదు. ఇలాంటి ప్రాజెక్టు ఫోర్‌షోర్‌లో పంపులు పెట్టి నీటిని తోడుకుపొమ్మని చెప్పటం ఆత్మహత్యా సదృశ్యం. ఇప్పటికే కృష్ణానది పై తెలంగాణ వాటా వాడుకోలేకపోతున్నాం.
ఇపుడు గోదావరి నీళ్లనూ పక్క రాష్ట్రానికి అప్పజెప్పేందుకు మాటలెలా వచ్చాయి? తెలంగాణలో ఏ గొడవా లేని ప్రాజెక్టు ఇది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాలు లబ్దిపొందుతున్నాయి. లక్ష్మీ, సరస్వతి, కాకతీయ మొదటి, రెండవ దశలతో పాటు, వరదకాలువ కింద 2 లక్షల ఎకరాల సాగుతో పాటు, గుత్ప, అలీసాగర్, కింద సాగును కేసీఆర్ గందరగోళంలో పడేయాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ప్రాజెక్టు ముందరి ఒడ్డు నుంచి ఎత్తిపోస్తే ప్రాజెక్టులో చాలా నీళ్లు వెళ్లిపోయి ఖాళీ అవుతుంది. వాస్తవంగా మహారాష్ట్ర ప్రభుత్వం జైక్వాడ్ ప్రాజెక్టు నుంచి బాబ్లీ వరకు అనేక ప్రాజెక్టులు లిఫ్ట్‌లు పెట్టి గోదావరి నీళ్లను వాడుతున్నది. దాంతో ఎస్ఆర్ఎస్పీకి ఒకప్పటిలా నీళ్లు రావడంలేదు. అధిక వర్షాలు పడి మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండాకనే, మనకు గోదావరి నీళ్లు వస్తాయి. అందువల్ల ఎస్ఆర్ఎస్పీ సెప్టెంబర్ వరకు నిండుతుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు మాత్రమే బాబ్లీ గేట్లు తెరిచి ఉంటాయి. ఆ తదుపరి ఆ గేట్లు మూసివేస్తారు. ఇది సుప్రీంకోర్టు నిర్ణయం. నవంబర్ నుంచి మనకు చుక్క నీరు రాదు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నవంబర్ నుంచే రెండవ పంటకు నీళ్లు వదులుతారు.
కాళేశ్వరం ఎవరి కోసం?
ఇకపోతే, కాళేశ్వరం మేడిగడ్డ నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపు పంపులు పెట్టి నీళ్లు తీసుకొమ్మని సెలవిచ్చారు. వర్షాకాలం నీళ్లు మేడిగడ్డ నుంచి ఎత్తిపోయలేం. ఆ తర్వాత 11 టీఎంసీలే నవంబర్ నుంచి ఎత్తిపోసే అవకాశం ఉంది. లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టి ఆ నీళ్లు కూడా మహారాష్ట్ర వాళ్లను పంపులు పెట్టి తీసుకుపొమ్మనడం తెలంగాణ రైతులను పుట్టిముంచడం కాదా? రేపు ఆంధ్రాకు వెళ్లి కేసీఆర్ పోతిరెడ్డిపాడు నుంచి మన నీళ్లను వెనక్కి తీసుకొస్తాడా? ఆ మాట కేసీఆర్ నోట ఎన్నటికైనా వినగలమా? ఇంటి దొంగ లాగా మన నీళ్లను ఇతరులకు దోచిపెట్టడం తప్ప, మన నీళ్లను మనకు కాపాడే సోయి కనిపిస్తున్నదా? ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పాలమూరు ఎత్తిపోతలకు పర్యావరణ, అటవీ అనుమతులు లేవని రూ. 920 కోట్ల పెనాల్టీ వేసి పనులు ఆపేసింది. ఇది ఇంకానయమని నిధుల కొరత ఎదుర్కొంటున్న కేసీఆర్ సర్కార్ సంతోషిస్తున్నది!
చాలెంజ్.. సాగుపెరగలేదు
తెలంగాణ వచ్చే నాటికి ఉన్న సాగుకు మించి సాగు పెరిగిందే లేదు. మన నీళ్లు మందికి దోచిపెట్టడానికి కేసీఆర్‌కు నోరెలా వచ్చింది? లక్షల కోట్లు ప్రాజెక్టుల పేర ఖర్చు చేశారు. కానీ వచ్చిన తెలంగాణలో సాగుభూమి మాత్రం పెరిగింది లేదని చాలెంజ్ గా చెపుతున్నాను. 2014 కు ముందే, తెలంగాణలో ఖరీఫ్‌లో ఒక కోటి 20 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నది. నేడు కూడా అంతే సాగు అవుతున్నది.
సాగునీటి మోసాలు చేస్తున్నది చాలదన్నట్లు..
ప్రాజెక్టులు, రీడిజైన్ల పేర రాజ్యమేలుతూ, పార్టీ పేరు మార్చుకొని పక్క రాష్ట్రాలకు నీళ్లు దోచిపెట్టడానికి వెనుకాడని కేసీఆర్ ను ప్రజలు తప్పక తిప్పికొడతారు. పక్క రాష్ట్రాలకు మన నాళ్లు దోచిపెట్టే అధికారం కేసీఆర్‌కు లేదు. కేసీఆర్‌కు ప్రజలే గుణపాఠం చెపుతారు.
గ్రావిటీ నీళ్లు దానం చేసి, లిఫ్ట్నీళ్లు మనకంటవా?
కాళేశ్వరం కట్టాం. మాకు పుష్కలంగా నీళ్లున్నాయని చెప్పారు. కాళేశ్వరం కట్టి తెలంగాణకు లక్షల కోట్ల అప్పుచేసి చుక్కనీరు రాక, మోటార్లు కాలిపోయి తెలంగాణకు శనేశ్వరంగా మారిన ప్రాజెక్టు నుంచి మాకు నీళ్లు వస్తాయి అని తెలిపిన సీఎం కేసీఆర్ పక్కా తెలంగాణ ద్రోహి కాక ఏమవుతారు? మనం వాడుకునే గ్రావిటీ నీళ్లు వాళ్లకిచ్చి , లిఫ్టునీళ్లు మనకు అని చెప్పిన కేసీఆర్ తెలంగాణకు సీఎం యేనా? అహంకారియా? ఎస్ఆర్ఎస్ఫీలోకి రివర్స్ పంపింగ్ అని రూ. రెండువేల కోట్లు ఖర్చుచేసి మూడు ప్రాంతాలలో లిప్ట్‌లు, పంపులు పెట్టి మిడ్‌మానేరు నుంచి ఎస్ఆర్ఎస్పీ కి చుక్కనీరు ఎత్తిపోయలేదు. అది విజయవంతం కాదని తెలిపిన ఇంజినీర్లను డీప్రమోట్ చేశారు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు పుష్కలంగా ఉంటే, అదే ఎస్ఆర్ఎస్ఫీకి రివర్స్ పంపింగ్ ఎందుకు పెట్టారు? ఒకవైపు ఎస్ఆర్ఎస్పీలోకి నీళ్లు ఎత్తిపోసి, ఎస్ఆర్ఎస్పీ గ్రావిటీ నీళ్లను మహారాష్ట్ర వాళ్లకు తీసుకుపొమ్మని చెప్పడం చూస్తే ఇంతకంటే తెలంగాణకు ద్రోహం ఇంకేముంటుంది?