భయం లేదంటూనే.. కేసీఆర్  భయపడుతున్నరు

తరతరాలుగా పరాయి పాలనలో దోపిడీకి గురై, ఎన్నో బలిదానాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలనతో సబ్బండ వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. త్యాగాల తెలంగాణలో ప్రజల ఆశలు నెరవేరే అవకాశం కనుచూపు మేరలో కనపడడం లేదు. త్యాగధనుల ఆశయాలను నెరవేర్చడానికి హుజూరాబాద్​ ఎన్నిక ఒక మలుపు కావాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడితేనే తెలంగాణ ప్రజలకు రక్షణ దక్కుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి కీలకంగా ఉన్న ఈటలకు అన్యాయం చేసిన కేసీఆర్ పై ఈ ఎన్నికల్లో కసి తీర్చుకోవడానికి జనం ఎదురుచూస్తున్నారు. ప్రజల నాడి తెలిసినందువల్లే ఒకవైపు భయం లేదంటున్న కేసీఆర్​ టీమ్​ మరోవైపు ఓటమి భయంతో వణికిపోతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి నోట విన్నా హుజూరాబాద్ ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. హుజూరాబాద్ ఎన్నిక, కేసీఆర్ నియంత పాలన, ఈటల రాజేందర్ లాంటి ఉద్యమకారులకు జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగే ఎన్నిక కాదని, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో నియంత పాలనకు చెక్ పెట్టే ఎన్నికగా అందరూ భావిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి- నియంతృత్వానికి, నోటుకు- ఓటుకు, తెలంగాణ వాదులకు- తెలంగాణ ద్రోహులకు, ఉద్యమకారులకు -దోపిడీ పాలకులకు మధ్య జరిగే ఎన్నికగా జనం చూస్తున్నారు.

టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం

కేసీఆర్ నియంత పాలనకు చెక్ పెట్టడానికి ఉద్యమ శక్తులన్నీ ఏకమవుతున్న సందర్భం ఒకవైపు, ప్రలోభాలతో ఆయా వర్గాలను కులాల వారీగా, వర్గాల వారీగా టీఆర్ఎస్ వైపు తిప్పుకుంటున్న సందర్భం మరోవైపు కొనసాగుతోంది. హుజురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ నిరంకుశ పాలనకు చెక్ పడుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పట్టపగ్గాలు ఉండవు. ఇంతటి ప్రాముఖ్యత గల హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక మాకు ఒక లెక్క కాదని, ఆ ఒక్క సీటు గెలిచినా ఓడినా తమ పార్టీకి పెద్దగా నష్టమేమీ లేదని కేసీఆర్ సహా టీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా బయటకు మాట్లాడుతూ లోలోపల చాలా భయపడుతున్నారు. అసెంబ్లీలో ఇప్పుడున్న రెండు సీట్లకు ఇంకో సీటు పెరిగి మూడు అవుతాయని, అంతకన్నా రాష్ట్రంలో పెద్ద మార్పు ఏముండదంటున్న టీఆర్ఎస్.. ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని వాడుకుంటూ, ప్రతి చిన్న నాయకుడిని ఏదో ఒక ఆశతో పార్టీలోకి తీసుకుంటున్న తీరు చూస్తే వారి వెన్నులో వణుకు పుడుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాలను హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ప్రవేశపెట్టడం, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో హుజూరాబాద్ వాసులనే నియమించడం, ఇన్నాళ్లూ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కొత్త రేషన్ కార్డులు, వివిధ రకాల పెన్షన్లను వెంటనే మంజూరు చేయడం, అభివృద్ధి పనులను పూర్తి చేయడం చూస్తుంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను హుజూరాబాద్ ఎన్నిక ఎంత భయపెడుతోందో అర్థం చేసుకోవచ్చు.

వేల మంది నాయకుల మోహరింపు ఎందుకు?

బీఆర్​ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఏర్పడిన తెలంగాణలో గద్దెనెక్కిన నాటి నుంచి ఏనాడు ఆయన విగ్రహానికి దండ వేసి దండం పెట్టని కేసీఆర్.. ఇప్పుడు దళిత నాయకులతో కలిసి భోజనం చేయడమే కాకుండా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దళితబంధు ప్రారంభోత్సవానికి కేసీఆర్ హుజూరాబాద్ రావడం చూస్తుంటే టీఆర్ఎస్ ఎంత భయపడుతుందో తెలుస్తోంది. ఐదుగురు మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర జిల్లాలకు చెందిన వేల మంది నాయకులను టీఆర్ఎస్ హుజూరాబాద్ లో మోహరించింది. ప్రతి రెండు ఇండ్లకు ఒక స్థానిక నాయకుడిని, నాలుగు ఇండ్లకు స్థానికేతర నాయకుడిని ఇన్‌‌‌‌చార్జ్​గా నియమించి ప్రతి వంద మంది ఓటర్లకు ఒక స్థానికేతర నాయకుడిని ఇన్​చార్జ్​గా పెట్టి ప్రజలను నిర్బంధంలో ఉంచి నిత్యం మత్తులో ముంచడాన్ని ఏమనాలి? ఏ నియోజకవర్గంలో లేని విధంగా వేల కోట్ల రూపాయలు హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఖర్చు చేయడం చూస్తుంటే ఓడిపోతామనే భయంతోనే ఇన్ని కుయుక్తులకు పాల్పడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులను హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఎందుకు చేస్తున్నట్లు? వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు లక్షలను ఎందుకు పంచుతున్నట్లు? కులాల వారీగా, వర్గాల వారీగా ప్రతినిధులను సిద్ధిపేటకు తరలించి మటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భోజనంతోపాటు మనిషికి ఐదు వేలు ఇచ్చి ఎందుకు మభ్యపెడుతున్నారు? ఇవన్నీ ఓటమి భయంతో చేస్తున్న పనులు కాదా?

పెండింగ్​ పథకం, పనులకు మోక్షం

ఈటల రాజీనామా కేసీఆర్ పాలనను ఒక కుదుపు కుదిపేసింది. అప్పటివరకు పెండింగ్‌‌‌‌లో ఉన్న కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన చేసి అర్హులకు అవకాశం కల్పిస్తామన్న ప్రకటన వెలువడింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. అందుకోసం హుజూరాబాద్ ఎన్నిక జరిగే వరకు మద్యం షాపుల వేలం వాయిదా వేశారు. హుజూరాబాద్‌‌‌‌లో యాదవులకు గొర్రెల పంపిణీ అమలు చేశారు. పంపిణీ చేసిన గొర్రెలను లబ్ధిదారుల నుంచి టీఆర్ఎస్ నాయకులే కొనుగోలు చేసి మూడు నెలలుగా విందు, వినోదాలతో ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. వార్డు మెంబర్లకు రూ.30 వేలు, సర్పంచ్​లకు, ఎంపీటీసీలకు రూ.ఐదు లక్షలు, జడ్పీటీసీలకు రూ.10 లక్షలు, ఎంపీపీలకు రూ.30 లక్షలు, ముఖ్య కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున డబ్బులు పంచిన టీఆర్ఎస్ నేతలు.. వారిని కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో నిత్య పరిశీలన చేయిస్తున్నారు. ఈటల వెంట తిరుగుతున్న చిన్నాచితక నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించి టీఆర్ఎస్ బలంగా ఉన్నట్లు వాతావరణం సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్‌‌‌‌లో చేరని వారి ఇండ్లలో చొరబడి సోదాల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని ఆయా కులాల రాష్ట్ర నాయకులను రప్పించి వాడల్లోని ముఖ్య నాయకులతో పాటు ప్రజలను నిత్యం మందు, విందులతో మత్తులో ముంచెత్తుతున్నారు. ఇంటికో ఫుల్ బాటిల్, ప్రతి నాలుగు ఇండ్లకు ఒక యాటను ఇచ్చి ఈసారి దసరా మొత్తం టీఆర్ఎస్ పార్టీయే జరిపిందంటే హుజూరాబాద్ ఎన్నిక పట్ల ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఓటమి భయంతోనే పదవుల పందేరం

ఈటల రాజీనామా చేసిన నాటి నుంచి కేసీఆర్ హుజూరాబాద్ పై ప్రత్యేక కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో 46 వేల ఎస్సీ ఓట్లను కొల్లగొట్టడానికి దళితబంధు ప్రకటించి రూ.రెండు వేల కోట్లు మంజూరు చేశారు. అంతే కాకుండా ఎస్పీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, బీసీ కమీషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే చెందిన వకులాభరణం కృష్ణ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించారు. ముదిరాజ్ కులంలో రాష్ట్ర స్థాయిలో పట్టున్న ఈటలను ఎదుర్కోవడం కోసం ఆ సంఘం రాష్ట్ర నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పార్టీలో చేర్చుకున్నారు. పద్మశాలి ఓట్ల కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణని కూడా పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టడానికి ఏకంగా గతంలో పోటీ చేసి ఓడిన కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా ఇంతవరకు ప్రగతి భవన్​లో ఒక్క ఎస్సీ అధికారి లేడనే అపవాదును తొలిగించుకోవడానికి ఎస్సీ ఐఏఎస్ అధికారిని నియమించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా ఒక ఎస్సీ ఐపీఎస్ అధికారిని నియమించారు. 45 రోజుల నుంచి నియోజకవర్గంలో 100 మంది ఇంటెలిజెన్స్ పోలీసులతో రోజువారీ సమాచారం తెప్పించుకుంటున్నారు.

అత్యుత్సాహం కొంప ముంచనుందా?

హుజూరాబాద్ ఎన్నికలో ఎలాగైనా గెలిచి పరువుతోపాటు పార్టీని కాపాడుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న కుటిల యత్నాలు, అత్యుత్సాహం భవిష్యత్​లో కొంపముంచే ప్రమాదం ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఉప ఎన్నికలో లేని విధంగా ప్రలోభ రాజకీయాలకు తెరలేపిన కేసీఆర్ వ్యూహాలు ఈసారి విజయవంతం కాకపోవచ్చు. దళితబంధు ద్వారా నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లను పంచినా.. దానికన్నా ప్రభుత్వ వ్యతిరేకతే ఎక్కువగా పని చేస్తోంది. ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున డబ్బు పంచడంతో డబ్బు అందని సామాన్యుల నుంచి వ్యతిరేకత వస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించాలని ఈ మధ్య కాలంలో చాలామంది ఇతర పార్టీల నాయకులను చేర్చుకున్నారు. ఇలాంటి వారి వల్ల ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశముంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకుల పెత్తనం వల్ల స్థానిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

చరిత్రలో నిలిచి పోయే ఎన్నిక

తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో డబ్బు వెదజల్లకుండా విజయం సాధించడం మరచిపోలేని చరిత్ర. అలాంటి చరిత్రను హుజూరాబాద్ ఎన్నిక తిరగరాసే అవకాశముంది. ఆనాడు రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఉద్యమకారులు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇల్లిల్లు తిరిగి టీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుందని ప్రచారం చేసి గెలిపించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నికల చుట్టూ తిప్పి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటై అధికారం చేపట్టిన తర్వాత కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఎంతటి నాయకుడినైనా అధికారంతో బెదిరించి, డబ్బుతో కొనవచ్చని, డబ్బు వెదజల్లుతే ఓట్లు రాలతాయని కేసీఆర్​ భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ ఎన్నికల ఎత్తుగడలతో కేసీఆర్ విజయాలు సాధించారో ఆ ప్రణాళికలతోనే పతనమయ్యే సమయం వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రలోభ రాజకీయాలు, విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం లాంటి ఎన్నో విషయాలు కేసీఆర్ పతనానికి కారణం కానున్నాయి. ఆనాడు కరీంనగర్ లోక్​సభ ఉప ఎన్నికలో ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ వెనక ఉన్నట్లుగానే, ఇప్పుడు స్వచ్ఛందంగా ఈటల వెనక ఉన్నారనేది సత్యం. ఆనాడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు పలికిన సబ్బండ వర్గాలు ఇప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామిక విలువలు లేకుండా చేసే టీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని, దానికి హుజూరాబాద్ ఎన్నిక మలుపు కావాలని ప్రజలు కోరుకోవడమే కాకుండా ఆ దిశగా తీర్పు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

- సాయిని నరేందర్, పొలిటికల్​ ఎనలిస్ట్