అర్హులందరికీ దళిత బంధు
దళారులను నమ్మవద్దు
గూడూరు, వెలుగు: దళిత బంధు పథకం అర్హులందరికీ అందుతుందని, దళితబంధు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సూచించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని కులాల అభివృద్ధికి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎవరైనా దళితబంధు ఇప్పిస్తానని మోసం చేస్తే.. జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఖాసీం, మండల కోఆప్షన్ మెంబర్ రహీం, లక్ష్మణ్ రావు, వెంకన్న, సురేందర్, ఎల్లయ్య, సురేశ్నాయక్, కఠార్ సింగ్ తదితరులున్నారు.
బాధితులకు అండగా ఉంటాం
మహాముత్తారం, కాటారం, మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాల్లో గురువారం టీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పర్యటించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాటారం మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజబాబు తండ్రి జగ్గయ్య మరణించగా అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎడ్లపల్లి, దొబ్బలపాడు, దామెరకుంట, విలసాగర్,చిదినెపల్లి, కాటారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేశ్, పీఏసీఎస్ చల్ల నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు తోట జనార్దన్, కల్వచర్ల రాజు, కుంభం రాఘవరెడ్డి, మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు భూపెళ్లి రాజు, లీడర్లు గోనె శ్రీనివాస రావు, మెండ వెంకటస్వామి, మందల రాజిరెడ్డి, పుట్టపాక శ్రీనివాస్, యాదగిరి రావు, రాధారపు స్వామి, తాజోద్దీన్, అయూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.
విలేకరిని దూషించిన వ్యక్తిపై కేసు పెట్టాలి
ఆత్మకూరు, వెలుగు: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కమలాపురం రమేశ్ ఆరోపించారు. విలేకరిని దూషించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఆత్మకూరు గ్రామంలోని అవినీతిపై వార్త రాస్తే టీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్లు దూషించారని తెలిపారు. టీఆర్ఎస్ లీడర్లకు ఎమ్మెల్యే వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.
పోడు సర్వే చేయాలి
గూడూరు, వెలుగు: గ్రామాల్లోని పోడు భూములను ఆఫీసర్లు సర్వే చేయడం లేదని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ రైతులు వాపోయారు. ఈమేరకు గురువారం వరంగల్ కలెక్టరేట్ లో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గుండెంగ జీపీ పరిధిలోని గన్యచెక్రు తండా, తేజ్య తండా, సూర్య తండా భూములు వరంగల్ జిల్లా పరిధిలోకి రావడం వల్ల ఇరు జిల్లాల ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. అంతటా సర్వే చేసి, తమ భూముల్ని మాత్రం వదిలిపెట్టారన్నారు. వెంటనే పోడు సర్వే జరిగేలా చూడాలని ఆఫీసర్లను వేడుకున్నారు. అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
లిక్కర్ స్కాంపై కేసీఆర్ నోరు విప్పాలి
ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేసీఆర్ నోరు విప్పాలని బీజేపీ, బీజేవైఎం లీడర్లు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో స్కాములకు పాల్పడి తెలంగాణ పరువు తీసిందన్నారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్కాములకు పాల్పడితే సొంత కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టేది లేదని గతంలో చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. లిక్కర్ స్కాంలో ముడుపులు తీసుకున్న ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. - – వెలుగు నెట్ వర్క్