రైతుల మాటున భూస్వాముల రాజకీయం

భూమి ఉన్న కులాలే రైతుల మాటున సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ భూస్వామ్య కులాల నుంచి ఎదిగిన నాయకులే ప్రాంతీయ పార్టీలు స్థాపిస్తున్నారు. వాటిని కుల, కుటుంబ సంస్థలుగా మార్చి వారసత్వ రాజకీయాలు నడుపుతున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రైతుల అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని భూస్వామ్య కులాలకు మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు ఇస్తున్నాయి. వ్యవసాయ కులాలు, వ్యవసాయేతర కులాలు అనే విభజన కొంతమందికి విస్తు కలిగించవచ్చు. కానీ వ్యవసాయ కులాలే మన సమాజంలో తిరుగులేని రాజకీయ ఆధిక్యతను సాధించాయి. వ్యవసాయేతర(శూద్ర సేవక, వృత్తి)కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అత్యంత బలహీనంగా మిగిలిపోయాయి. 

దేశ అభివృద్ధిలో భాగంగా వచ్చిన భారీ జల ప్రాజెక్టుల నిర్మాణం, హరిత విప్లవం, క్షీర విప్లవం, పారిశ్రామికరణ, పట్టణీకరణతో వివిధ రాష్ట్రాల్లో భూమి కలిగిన, మధ్యస్థ, భూస్వామ్య కులాలు ఆధునికతకు, అధికారానికి చేరువయ్యాయి. ఉదాహరణకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లోని గుజ్జర్లు, జాట్లు, ఉత్తరప్రదేశ్, బీహార్ లోని భూమిహార్, యాదవ్, కూర్మిలు, మహారాష్ట్రలోని మరాఠాలు, కర్నాటకలోని వక్కలింగలు(గౌడాలు), ఒడిశాలోని పట్నాయకులు, తెలుగు రాష్ట్రాల్లోని రెడ్డి, కమ్మ, వెలమ, కాపులు ఆధిపత్యం చేస్తున్న కులాలు. ఈ కులాలకు చెందిన వారితోనే తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్​సీపీ, తెలుగుదేశం, టీఆర్ఎస్(బీఆర్ఎస్), జనసేన పార్టీలు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, కర్నాటకలో జనతా దళ్(ఎస్), బీహార్ లో జనతా దళ్(యు), రాష్ట్రీయ జనతా దళ్, ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ, హర్యానాలో హర్యానా వికాస సమితి, పంజాబ్ లో అకాలీ దళ్ పార్టీలు ఏర్పడ్డాయి. వీటికి తోడుగా కమ్యూనిస్టు మార్క్సిస్టు, నక్సలైట్ పార్టీలు, ఇతర సంస్థలను కూడా భూస్వామ్య వ్యవసాయ కులాల వారే అగ్ర నాయకులుగా నడుపుతున్నారు. 

ప్రాజెక్టుల పేరుతో..

భూస్వామ్య కులాల నుంచి ఎదిగిన ఉప ప్రాంతీయ పార్టీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటూ బీఆర్ఎస్​గా నామకరణం చేశారు.‘‘ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ నినాదంతో ఖమ్మం ఆవిర్భావ సభలో తెలంగాణ అభివృద్ధి మోడల్ అంటూ రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇంటింటికీ తాగునీరు, దళిత బంధు, కంటి వెలుగు పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికే బీఆర్ఎస్​పుట్టిందని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్సార్​హైదరాబాద్ భూములను అమ్మగా వచ్చిన డబ్బులతో జలయజ్ఞం తెచ్చి, దాన్ని ధనయజ్ఞంగా మార్చారు. అదే దారిలో ఉద్యమ నేత సీఎంగా రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పి, లక్ష కోట్లతో నిర్మించి వేలకోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి . కమీషన్లకు రుచి మరిగిన కేసీఆర్.. దేశంలో వేల టీఎంసీల నీరు వృథాగా కాకుండా ఉండాలంటే భారీ జల ప్రాజెక్టు అవసరమని బొంకుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ‘వైట్ ఎలిఫెంట్’ గా మారింది. వేల సంఖ్యలో చిన్న, సన్నకారు, కౌలు రైతులు భూమిలేని వృత్తిదారులు, భూనిర్వాసితులుగా మారారు. ఈ ప్రాజెక్ట్ కు తెచ్చిన అప్పులు, వడ్డీలు, కరెంటు బిల్లులు రాబోయే రాష్ట్ర ప్రభుత్వానికైనా గుదిబండలా మారక తప్పదు. 

ఉచిత కరెంట్​లోనూ వాళ్లే..

రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ఇస్తున్నట్లు, దేశ రైతులందరికీ ఉచిత కరెంటు ఇస్తానని ఖమ్మం సభలో కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత కరెంటుతో సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పెరిగింది.  ఎల్ టీ ద్వారా 2020-21లో మొత్తం కరెంటులో 53% వ్యవసాయానికి ఉచిత కరెంటుగా, మిగిలిన 47% కరెంట్ అన్ని ఇతర అవసరాలకు వినియోగించారు. ఈ 53% వ్యవసాయ ఉచిత కరెంటు వినియోగంలో 40 శాతం ఉచిత కరెంటును భూస్వాములు వ్యవసాయానికి, ఫామ్ హౌస్ లకు వాడుకున్నారు. హెచ్ టీ సరఫరా అయ్యే కరెంటులో 24 % ఇరిగేషన్ ప్రాజెక్టులకు రాష్ట్రం వినియోగిస్తున్నది. కానీ ఎల్ టి, హెచ్ టి  ద్వారా సరఫరా అయ్యే కరెంటు వినియోగ ఖర్చులు మొత్తం గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులే మోస్తున్నారు. కేసీఆర్ మాత్రం భూస్వాముల పట్ల ఉన్న ప్రేమతో దేశంలో బీఆర్ఎస్​ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చుతో దేశ రైతులందరికీ వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తానని మభ్యపెడుతున్నారు.

భూమి ఎవరి దగ్గర ఉన్నది?

తెలంగాణలో రైతును రాజు చేస్తానన్న కేసీఆర్ రాజునే రైతుగా చూపిస్తున్నాడు. రైతు బంధు పథకంతో భూస్వాములకు అప్పనంగా వేల కోట్లు పంచి పెడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య కోటి. అందులో గుంట భూమి లేని కుటుంబాలు69 శాతం ఉంటే, మిగిలిన 31 శాతం కుటుంబాల దగ్గరే వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతుల్లో 85% ఉన్న చిన్న, సన్నకారు రైతుల దగ్గర ఉన్న భూమి కేవలం 60 శాతమే మిగిలిన15 శాతంగా ఉన్న భూస్వాముల దగ్గర ఏకంగా 40 శాతం భూమి ఉన్నది. 69 లక్షల కుటుంబాల్లో 90 శాతం వ్యవసాయేతర కులాలైన దళితులు, సంచార జాతులు, ఎంబీసీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. దేశం మొత్తంగా చూస్తే కుటుంబాల సంఖ్య 35 కోట్లు. అందులో వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలు 9.5 కోట్లు మాత్రమే. ఇందులో కూడా 8 కోట్ల కుటుంబాల దగ్గర ఉన్న భూమి మొత్తం భూమిలో 47%, మిగిలిన1.5 కోట్ల భూస్వామ్య కుటుంబాల దగ్గరే 53 % భూమి ఉంది.

భూస్వామ్య కుల పార్టీలను ఇంటికి పంపాలె..

రైతుల పేరుతో రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత కరెంట్ పథకాలు, సాగునీటి ప్రాజెక్ట్ లు ఎవరి ప్రయోజనాల కోసం కేసీఆర్ అమలు చేస్తున్నారో అర్థం అవుతుంది. వ్యవసాయేతర కులాలకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రాంతీయ పార్టీలు తమ అధికారమే పరమావధిగా పాలనా సాగిస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే సహజ వనరులను, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. సంక్షేమ పథకాల రూపకల్పనలో, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కులాల సంఖ్యా బలాన్ని, కార్యకర్తల, నాయకుల ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటూ, సామాజిక, ఆర్థిక పారామీటర్స్ పాటించకుండా, తమ సొంత డబ్బులను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు వ్యవరిస్తున్నారు. ఇలాంటి ప్రాంతీయ భూస్వామ్య కుల, కుటుంబ, వారసత్వ పార్టీల వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టినప్పుడే సమాజంలోని చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి.

–సూర్యపల్లి శ్రీనివాస్, స్టేట్ కన్వీనర్, బీజేపీ ఓబీసీ రీసెర్చ్ అండ్ పాలసీ డివిజన్, తెలంగాణ