జగిత్యాల, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్.. పేదలకు మాత్రం ఇండ్లు కట్టియ్యలేదని మండిపడ్డారు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, ధర్మపురి, గొల్లపల్లి, బుగ్గారంలో కాంగ్రెస్ పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి వివేక్ పర్యటించారు. పెగడపెల్లిలో కార్నర్ మీటింగ్, ధర్మపురిలో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్, గొల్లపెల్లిలో ఆశీర్వాద సభ, బుగ్గారంలో ప్రజాగర్జన సభల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘రూ.70 వేల కోట్లకు పైగా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.1.40 లక్షల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టే అవకాశం ఉన్నా కట్టలేదు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కమీషన్లు తీసుకుని దోచుకున్నారు. కాళేశ్వరంతో ఒక్క చుక్క నీరు రాలేదు. లింక్ 2 ప్రాజెక్టు కోసం జగిత్యాల ప్రాంతంలో భూమి సేకరించారు. కానీ నష్ట పరిహారం చెల్లింపులో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మిషన్ భగీరథ కింద పాత పైపులు వేశారు. ఏ ఇంటికీ నీళ్లు రాలేదు” అని అన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. స్వరాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే వీ6 వెలుగును దెబ్బతీసేందుకు గత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేశారు. యాడ్స్ రూపంలో రావాల్సిన రూ.150 కోట్లు మంజూరు చేయలేదు. అలాగే పటాన్ చెరులో ఫ్యాక్టరీని మూసేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా వెనకడుగు వేయకుండా పోరాటం చేశాం” అని చెప్పారు.
వంశీ గెలిస్తే పార్లమెంట్ లో మీ గొంతు వినిపిస్తడు: అడ్లూరి
పెద్దపెల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. వంశీ గెలిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడతారని చెప్పారు. ‘‘పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి అనేక సేవలు చేశారు. కాకా కుటుంబం అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నది. వంశీకృష్ణను గెలిపిస్తే ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారు” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఒక చుక్క నీరు కూడా రాదని... ఇక్కడి నీళ్లను తన ఫామ్ ఫౌస్ కు తరలించుకుపోయేందుకే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్ప, తాలు పేరుతో క్వింటాల్ కు 8 కిలోల వరకు కట్ చేసినా మాట్లాడని కొప్పుల ఈశ్వర్.. ఇప్పుడు వరి కల్లాల దగ్గరికి వెళ్తున్నారని అన్నారు. కాగా, వివేక్ సమక్షంలో దాదాపు 500 మంది కాంగ్రెస్ లో చేరారు. గొల్లపెల్లిలో 300 మంది, బుగ్గారంలో 200 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పెగడపెల్లి మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు, పార్టీ గొల్లపెల్లి మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, లీడర్లు తాటిపర్తి శోభారాణి, ఓరుగల శ్రీనివాస్, పూసాల తిరుపతి, గజ్జల స్వామి, కడారి తిరుపతి, చంద్రశేఖర్ రావు, సంతోశ్, సురేందర్, సత్యనారాయణ గౌడ్, గంగాధర్, తిరుపతి రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కొప్పుల కట్టిన ఇండ్లు ఎన్ని?
మంత్రిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారో చెప్పాలని వివేక్ ప్రశ్నించారు. ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారో, ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో చెప్పాలన్నారు. ‘‘సింగరేణి బిడ్డగా చెప్పుకుంటున్న కొప్పుల.. మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులను పట్టించుకోలేదు. ఆయన కొట్లాడకపోవడంతోనే కార్మికులు 24 వేల ఉద్యోగాలు నష్టపోయారు. 1995లో కాకా వెంకటస్వామి కొట్లాడి సింగరేణి సంస్థలో లక్ష ఉద్యోగాలను కాపాడారు. కొప్పుల భూదందా, ఇసుక దందాతో దోచుకున్నారు. కార్మికుల కష్టాలను పట్టించుకోలేదు” అని ఫైర్ అయ్యారు. ‘‘ఆరు గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ ను రూ.10 లక్షలకు పెంచినం.ఆగస్టు లోపు రుణమాఫీ చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని చెప్పారు.
బీఆర్ఎస్ నేతలు దళిత,కార్మిక ద్రోహులు: వంశీకృష్ణ
కాకా వెంకటస్వామి నీడలో పెరిగానని, ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కోసం పాటుపడతానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పారు. ఇండస్ట్రీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కాకా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్ పోతుందని బీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేశారు. కానీ అసలు పింఛన్ ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నేతలు.. దళిత, కార్మికుల ద్రోహులు. వాళ్లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు” అని ప్రశ్నించారు. జగిత్యాల ప్రాంతానికి సాగు నీరు తీసుకొచ్చే బాధ్యత తనపై, ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నపై ఉందని చెప్పారు.