ఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా?

ఎర్లీ ఖరీఫ్ సారు ఇలాఖాకేనా?
మిడ్​మానేరులో నీళ్లున్నా ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇవ్వరట
రంగనాయకసాగర్​కోసం ఎత్తిపోతలు షురూ
ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశమున్నా విడుదలకు నో
వర్షాలు కురిసేదాకా నీళ్లు వదలొద్దని సీఎం ఆదేశం
సొంత ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మాత్రం ఎత్తిపోతలు

హైదరాబాద్, వెలుగు : రుతుపవనాల ఆలస్యంతో ఈసారి వానాకాలం సీజన్ ​మొదలైన 20 రోజుల దాకా జల్లులు పడకపోవడంతో కేసీఆర్ ​ఇటీవల ఇరిగేషన్​ అధికారులతో హైలెవల్ ​మీటింగ్ ​పెట్టారు. ఎంత ఖర్చయినా సరే పంటలు కాపాడుతామన్నారు. అయితే అదంతా సొంత ఇలాఖా కోసమే. మిడ్​మానేరులో నీళ్లున్నా ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వకు నీళ్లివ్వరట.. వర్షాలు కురిసే వరకు నీళ్లిచ్చేదే లేదని ఇంజనీర్లకు సీఎం ఖరాఖండిగా చెప్పారు. అదే సమయంలో రంగనాయకసాగర్​లో నీళ్లు లేవు కనుక దాని కింది రైతులకు భరోసానిచ్చేందుకు మిడ్​మానేరు నుంచి వెంటనే 2 టీఎంసీలు ఎత్తిపోయాలని ఆర్డర్ ఇచ్చారు. సీఎం ఆదేశించడమే తరువాయి అన్నట్టుగా బుధవారమే మిడ్​మానేరు నుంచి అనంతగిరికి, అక్కడి నుంచి రంగనాయకసాగర్​కు ఎత్తిపోతలు షురూ చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​కింది ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతంతో పాటు నిజాంసాగర్​కింద 1.30 లక్షల ఎకరాలకు బుధవారం నీటిని విడుదల చేశారు. వర్షాలు ఆలస్యమైనా ఇప్పుడు ఉన్న నీళ్లతో వారబందీ పద్ధతిలో మూడు తడులు ఇచ్చేలా యాక్షన్​ప్లాన్​రెడీ చేశారు.

సొంత ప్రాంతానికి నీటి తరలింపు

తెలంగాణ లైఫ్​లైన్​అంటూ సీఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వం ఊదరగొట్టిన కాళేశ్వరం (మేడిగడ్డ) నుంచి ఎత్తిపోయడానికి నీళ్లు లేవు. మిడ్​మానేరులో గత బుధవారం నాటికి 19.48 టీఎంసీల నీళ్లు ఉండగా అందులోంచి ఒక టీఎంసీ లిఫ్ట్ చేశారు. లోయర్​మానేరు డ్యాం (ఎల్ఎండీ) దిగువన కాకతీయ కెనాల్​ఆయకట్టు 4.19 లక్షల ఎకరాలకు ఆగస్టు చివరి నాటిని వారబందీ పద్ధతిలో నీళ్లివ్వడానికి ఇక్కడి నుంచి 5 టీఎంసీలు, ఎల్ఎండీ నుంచి ఇంకో మూడు టీఎంసీలు విడుదల చేసే అవకాశముంది. కానీ వర్షాలు ఆలస్యమవుతున్నాయన్న సాకుతో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయకట్టుకు ఇప్పుడే నీళ్లివ్వాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. యాసంగి వరినాట్లు ఆలస్యంగా వేస్తుండటంతో పంటచేతికొచ్చాక తుపాన్లతో దెబ్బతింటున్నాయని, పంటల కాలాన్ని నెల ముందుకు జరపాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువ ఆయకట్టును ఇలా ఎర్లీ ఖరీఫ్​లోకి తెచ్చే అవకాశం ఇక్కడే ఉంది.. కానీ దీన్ని అమలుచేసేందుకు కేసీఆర్ రెడీగా లేరు. కారణం ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీళ్లిస్తే వర్షాలు ఇంకా ఆలస్యమైతే తన సొంత ఇలాఖాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు ఎక్కడ నీటి కొరత తలెత్తుతుందోనని ఆయన అనుమానిస్తున్నారు. అందుకే రంగనాయక సాగర్​కు అర్జంట్​గా నీళ్లు ఎత్తిపోయాలని ఆదేశించారే తప్ప గేట్లు ఎత్తితే పారే కాల్వ కింద ఆయకట్టును మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. మిడ్​ మానేరు నుంచి ఇంకో ఐదు టీఎంసీలు తరలిస్తే ఎస్సారెస్పీ స్టేజీ –2 ఆయకట్టుకు ఆగస్టు వరకు నీళ్లివ్వొచ్చు.. ఇక్కడ ఇంకో 3 లక్షల ఎకరాల ఆయకట్టును నెల ముందే సాగులోకి తేవచ్చు.. మొత్తంగా ఏడు లక్షల ఎకరాలకు పైగా ముందే సాగులోకి తెచ్చే అవకాశం ఉన్నా దానిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు.

ALSOREAD:ఫేక్ పే స్లిప్​లతో రూ. 20 కోట్ల పర్సనల్ లోన్

ఏడు లక్షల ఎకరాలు వదిలి లక్ష ఎకరాలకు ప్రాధాన్యం

రాష్ట్రంలోని గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ప్రాజెక్టులకు మాత్రం జూలై మూడో వారం వరకు పెద్దగా ప్రవాహాలు రాకపోవచ్చని ఐఎండీ, ఇరిగేషన్​వర్గాలు చెప్తున్నాయి. వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తే తప్ప వాటికింది ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం లేదు. ఎండకాలంలో అన్ని చెరువులను ఖాళీ చేశారు. రిజర్వాయర్లలోనూ పెద్దగా నిల్వల్లేవు. ఎస్సారెస్పీలో 20.07 టీఎంసీలు, సింగూరులో 17.31 టీఎంసీలు, నిజాం సాగర్​లో 4.23 టీఎంసీలు, ఎల్ఎండీలో 7.21 టీఎంసీలు, కడెంలో 3.18 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 12.01 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మిడ్​మానేరు కింద 50 వేల ఎకరాలు, ఎల్లంపల్లి కింద ఇంకో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా వాటి ఆయకట్టును పరిగణలోకి తీసుకోలేదు. సుమారు 8 లక్షల ఎకరాలకు ముందే నీళ్లిచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ కింద లక్ష ఎకరాలకు నీళ్లివ్వడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో పాటు నిజాంసాగర్​కింద 1.30 లక్షల ఎకరాలకు బుధవారమే నీటిని విడుదల చేశారు. పంట సీజన్​ను ముందుకు తీసుకురావాలని టార్గెట్​పెట్టుకున్నా ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో అది ఈ ఏడాది కూడా ఆచరణ సాధ్యం కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడే రోహిణి కార్తెలోనే నారు మళ్లకు నీళ్లిస్తామని ప్రకటించారు. నాలుగేళ్లు గడిచినా రోహిణిలో కాదు మృగశిర కార్తెలోనూ నీళ్లు ఇవ్వలేదు. కృష్ణా బేసిన్​ప్రాజెక్టుల్లో తక్కువ నీళ్లు ఉండటంతో ఎగువ నుంచి వరద వస్తే తప్ప వాటి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే పరిస్థితే లేదు.