కేసీఆర్ సారు బయటికి రారా? యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్టేనా?

కేసీఆర్ సారు బయటికి రారా? యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్టేనా?
  • ఈ ఏడాది బీఆర్ఎస్ కు కొత్త ప్రెసిడెంట్!
  • ఇటీవలే చిట్ చాట్ లో చెప్పిన కేటీఆర్
  • ఫ్యామిలీ మెంబర్ కే పగ్గాలు అప్పగిస్తారా..?
  • రేసులో కేటీఆర్, హరీశ్, కవిత ఉన్నారని టాక్
  • ఎస్సీ లేదా, బీసీకి బాధ్యతలిస్తారని చర్చ
  • ఆర్ఎస్ ప్రవీణ్ కు అప్పగిస్తారని మరో చర్చ

హైదరాబాద్: పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ బాస్ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టేనా..? ఆయనిక బయటికి రారా..? పార్టీ పగ్గాలను ఇతరులకు అప్పగిస్తారా..? అనే ది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 2025లో బీఆర్ఎస్ కు కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నారంటూ చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడిగా కొనసాగిన కేసీఆర్ ఇక క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతారా..? అనే చర్చ మొదలైంది. అయితే పార్టీ పగ్గాలను ఇతరులకు ఇవ్వరని కుటుంబ సభ్యులకే అప్పగిస్తారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవిత లేదా హరీశ్ కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాము అధ్యక్ష రేసులో ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారా..? అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని గతంలో మాట ఇచ్చిన కేసీఆర్ ఆ హామీని నెరవేర్చుకునేందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎస్సీ నేతకే ఇస్తారనే టాక్ కూడా వస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా బీసీ నినాదంతో రేవంత్ సర్కార్ దూకుడుగా వెళ్తోంది. ఓ వైపు కుల గణన.. బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లను పైకెత్తుకుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత బీసీల జపం మొదలు పెట్టారు. అటు బీజేపీ కూడా బీసీ సీఎం నినాదం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలు నిర్ణయాత్మకశక్తిగా మారుతారనే టాక్ కూడా బలంగా వస్తోంది. దీంతో  బీసీ నేతకు బీఆర్ఎస్ అప్పగిస్తారనే మరో చర్చ కూడా మొదలైంది. పార్టీ అధ్యక్షుడిగా ఫ్యామిలీ మెంబర్ ను కాకుండా ఇతరులకు అప్పగిస్తే.. కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కలహాలకు చెక్ పడుతుందని, దీనివల్ల కేటీఆర్, కవిత, హరీష్‌రావు ఒకే తాటి మీదకు వస్తారని పార్టీ  నేతలు చెబుతున్నారు. 

దాదాపు పాతికేళ్ల తర్వాత

2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి దాదాపు పాతికేళ్ల తర్వాత అధ్యక్షుడి మార్పుపై చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ అదే పేరుతో ఐదేండ్లు రాష్ట్రాన్ని పాలిచింది. రెండో సారి కూడా టీఆర్ఎస్ పేరుతోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జాతీయ  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కేసీఆర్ ఆలోచనతో భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. 2023లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదు. ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. అసెంబ్లీకి కూడా రాకపోవడాన్ని అధికార పార్టీ పదే పదే తప్పు పడుతూ వస్తోంది. ఈ తరుణంలో పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం అంశం తెరమీదకు రావడంతో కేసీఆర్ యాక్టివ్  పాలిటిక్స్ నుంచి తప్పుకొన్నట్టేనా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.