
- నిరుడు జులై బడ్జెట్ సమావేశాలకు హాజరు.. మళ్లీ ఇప్పుడే
- 40 నిమిషాలకుపైగా సభలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. నిరుడు జులై 24న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. మళ్లీ బుధవారం సభలో అడుగుపెట్టారు. ఇన్నాండ్లు ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. కీలకమైన బిల్లుల చర్చ సందర్భంగా కూడా అసెంబ్లీకి రాలేదు. తాజాగా మళ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆయన వచ్చారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు.. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.
అనంతరం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్‌లో పార్టీ సభ్యులతో సమావేశమై.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఇక, గవర్నర్ ప్రసంగం సమయంలో 40 నిమిషాలకుపైగా ఆయన సభలో గడిపారు. అనంతరం నిర్వహించిన ప్రతిపక్ష నేత హోదాలో బీఏసీ మీటింగ్‌కు హాజరు కావాల్సి ఉన్నా వెళ్లలేదు. సభ పూర్తికాగానే నేరుగా ఆయన నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చకు వస్తరా!
రెండు రోజుల కింద నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతివ్వాలని పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ఈ నెల 17, 18వ తేదీల్లో అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఉండనున్నది. ఆ బిల్లులపై చర్చకు కేసీఆర్ వస్తారా? రారా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నది.
గవర్నర్ ప్రసంగానికి వచ్చిన కేసీఆర్.. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే వస్తారన్న ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి నిరుడు డిసెంబర్ 28న కులగణన బిల్లు, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై జరిగిన చర్చకూ కేసీఆర్ హాజరు కాలేదు.