కేసీఆర్ పాలన అవినీతిమయం.. అమరవీరుల కల సాకారం కావాలంటే బీఆర్ఎస్ ను బొందపెట్టాలె

కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతమయమైందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోందన్నారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని అనుకున్నారని...కానీ కొందరికే బంగారు తెలంగాణ పరిమితం అయిందన్నారు. తెలంగాణను వ్యతిరేకించే వాళ్ల పెత్తనం రాష్ట్రంలో నడుస్తోందని చెప్పారు. అమరవీరుల కలలు సాకారం అవ్వాలంటే బీఆర్ఎస్  ను బొందపెట్టాలన్నారు. 
  
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్...పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మాటలు కోటలు దాటుతున్నాయని కానీ..చేతలు మాత్రం గడపకూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చామని చెబుతున్న కేసీఆర్....కానీ దాని వెనుక ఎంత అవినీతి జరిగిందో కూడా వివరించాలని డిమాండ్ చేశారు. 

తాను నాలుగేళ్ల క్రితమే బీఆర్ఎస్ పై తిరుగుబావుటా ఎగురవేశాని జూపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నానని చెప్పారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని..పేదలకు చదువు లేదు..విద్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు.