ఆధునిక కాలంలో దేశాభివృద్ధి అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రజలతో ఎంత దగ్గరగా సంబంధాలు కలిగి ఉంటే అంతగా అభివృద్ధిని సాధించవచ్చు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాలకులు అందరూ ఆమోదించి అనుసరిస్తున్న ప్రధానమైన పాలనా సూత్రం కూడా ప్రజా సంబంధాలే. ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వారినే విస్మరించి విజయం సాధించలేం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు మొట్టమొదటగా చేయవలసిన పని ఏమిటంటే, ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకొనని వారిని అన్ని స్థాయిల్లో భాగస్వాములను చేయటానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టడమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన దూరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించే కార్యక్రమాలపైనే దృష్టి సారించింది. ప్రజలే కేంద్రంగా, పాలన కొనసాగే విధంగా ప్రజా పాలనా కార్యక్రమాన్ని చేపట్టింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జనాభాపరంగా, భౌగోళికంగా చిన్న రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రం చిన్నదైంది. కానీ, పరిపాలన ప్రజలకు దూరమైంది. చిన్న రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించబడతాయని అంతే స్థాయిలో తమ అవసరాలు తీరుతాయని, ఊహించనివిధంగా అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ, పాలకుల వైఖరి వలన పరిపాలన ప్రజలకు అందనంత దూరంగా ప్రయాణాన్ని సాగించింది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రజలకి- ప్రభుత్వానికి మధ్య దూరం క్రమంగా పెరిగిన మాట వాస్తవం. దాంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పెరిగిన దూరం వలన సమస్యల చిట్టా పెరిగిపోవటానికి దారితీసింది. నాలుగున్నర లక్షలకు పైగా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి అంటే, పరిపాలన ఎంత భాధ్యతా రహితంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. పాలకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం పైన దృష్టి పెట్టలేదు. పాలకులు ప్రజలకు చాలా దూరంగా ఉన్నారు.
ప్రజా సంబంధాలు లేవు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం ఈ స్థాయిలో పెరగలేదు అనేది వాస్తవం. నాటి ప్రభుత్వాలు కూడా ప్రజలకు దగ్గర కావటానికి వివిధ కార్యక్రమాలు చేపట్టినాయి. అవి ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలు ప్రజల్లో పాలనా పరమైన అవగాహనను పెంపొందించాయి. అందుకు విరుద్ధంగా కొత్త తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడ విన్నవించుకోవాలో తెలియని ఆగమ్య గోచరంగా పరి పాలన జరిగింది. ప్రజా సంబంధాలను పూర్తిగా ధ్వంసం చేసి, నిరంకుశ పాలనను తలపింపచేసింది. ఒక రకంగా చెప్పాలంటే మనం భారత రాజ్యాంగం ఏర్పాటుచేసిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం అన్న విషయాన్ని పాలకులు మర్చిపోయి ప్రవర్తించారు. వారు వ్యవహరించిన తీరు వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. పరిపాలన అంతా రహస్య పూరితం కావటాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు గడీల పాలనగా చెప్పుకొన్నారు. ఇది కఠినమైన పాలనా వైఖరికి పరాకాష్ట.
ప్రభుత్వ నిర్ణయాలకు, ప్రజల సమస్యలకు పొంతనలేదు
సాధారణంగా ప్రజాస్వామ్యంలో పాలకుడు ప్రజల మధ్య నిరంతరం తిరుగుతూ, వారి సమస్యలను వారి అవసరాన్ని అడిగి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారితో మమేకమై పని
చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ఉండవలసిన అతి ప్రధానమైన లక్షణం. కానీ ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వంటి విపత్తులు సంభవించిన విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం కొంచెం కూడా జరగలేదు. ఇలాంటి వైఖరి వలన .. పరిపాలన లేదు అన్న భావన ప్రజల్లో తీవ్రతరమైంది. పాలకుడు తీసుకున్న నిర్ణయాలకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. ప్రజల అవసరాలు ఒకరకంగా ఉంటే, ప్రభుత్వం నిర్ణయం మరొక రకంగా ఉంటూ పాలన సాగింది. పాలన సాగిన వైనం చూస్తే రాజు మాటే శాసనం అన్న సినిమా డైలాగును తలపించేదిగా పాలన సాగింది.
గోప్యంగా సాగిన పాలన
సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అని చెప్పుకొనే సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడానికి అనేక ఆటంకాలు సృష్టించబడ్డాయి. ప్రభుత్వ జీ.వోలు గానీ ఇతర నిర్ణయాలు గానీ ప్రజల చేతికి అందకుండా అత్యంత గోప్యంగా ఉంచి పాలన సాగించారు. ప్రజలు అప్రమత్తం కాకుండా అతి జాగ్రత్తలు తీసుకుంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయాలని చూసింది. ఇలాంటి చర్యల వలన ప్రభుత్వ విధానాలు ఏమిటో, చేపట్టే చర్యలు ఏమిటో ప్రజలకు తెలియకుండా పోయాయి. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచి ప్రజలకు చేరువ అయ్యే చట్టాలు కార్యక్రమాలు దాదాపుగా కనుమరుగు అయినాయి. పరిపాలనలో అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ లేకుండా పోయింది. ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం అనే భావనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ లేదు. వాస్తవంగా అంతర్జాతీయంగా పాలన వ్యవస్థలో ప్రజల యొక్క భాగస్వామ్యానికి రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతూ పోతుంటే, అందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. తద్వారా మొత్తం పాలన యంత్రాంగం నిస్సత్తువగా తయారై తన శక్తి సామర్థ్యాలను కోల్పోవటానికి దారితీసింది.
పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉద్యమంలా సాగాలి
గత ప్రభుత్వ విధానాలు అన్ని ఫలితాలు రాబట్టలేని దండయాత్రగా భావించవచ్చు. ఈ దండయాత్రలో వేల కోట్ల రూపాయల ప్రజా సంపదంతా వృథా అయిపోయింది. ప్రజాభిప్రాయాలకు విలువనివ్వని ప్రభుత్వాలు అధికారంలో ఎక్కువ కాలం ఉండబోవు అని చరిత్ర చెప్తున్న సత్యం. అందుకు చరిత్రలో ఎన్నో రుజువులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వ పాలనకు చోటు లేదు అని ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టం చేసింది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం నిరంతరం ఒక ఉద్యమంలా సాగాలి. ప్రజలే కేంద్రంగా పాలన సాగినంతకాలం ప్రభుత్వాలకు తిరుగు ఉండదు. నేటి ప్రజాపాలన భవిష్యత్ పాలనకు మార్గదర్శనంగా నిలవాలి.
- నాగుల వేణు యాదవ్,
అసిస్టెంట్ ప్రొఫెసర్