- కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే సర్వం కోల్పోతం: కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టులను అప్పగిస్తే సర్వం కోల్పోతామని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అధికారులను పంపి ప్రాజెక్టుల అప్పగింతకు ఈ ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటదని మండిపడ్డారు. ప్రాజెక్టులను బోర్డుకు రాసిచ్చేసి అదేదో కేసీఆర్ చేసిన తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం నిజం కాదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్జిల్లాల ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ప్రభుత్వాన్ని దించేసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టినా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖం ముందట్నే చెప్పానన్నారు.
ప్రాజెక్టులపై అసెంబ్లీలో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు కొట్లాడితే నల్గొండ సభ వేదికగా తాను, సీనియర్లీడర్లు కొట్లాడుతారని అన్నారు. ‘‘నల్గొండలో సభ పెట్టనివ్వరట.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరు అడ్డుకోవడానికి.. నల్గొండ వాళ్ల జాగీరా.. ఎట్లా పెట్టనివ్వరో చూద్దాం.. వాళ్లు పర్మిషన్ ఇయ్యకుంటే కోర్టుకు పోయి తెచ్చుకుంటం” అని అన్నారు. కొత్త సీఎంవి పిల్ల చేష్టలని, పాలన చేతకాక తనపై కారు కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ‘‘కొత్త సీఎం నన్ను వ్యక్తిగతంగా.. బీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నడు.. నన్ను, నా పార్టీని టచ్చేయడం నీతో కాదు.. నీకంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాది.. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం” అన్నారు. ఈ నెల 13న నిర్వహించే చలో నల్గొండ సభను సక్సెస్ చేయాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.
ALSO READ : కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో పసికందు మృతి