కృష్ణా జలాల్లో తాత్కాలిక సర్దుబాటుకే ఒప్పుకున్నం.. : కేసీఆర్

తాత్కాలిక సర్దుబాటుకే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని కేసీఆర్ తెలిపారు. ‘‘విభజన టైమ్​లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి. ఆ తర్వాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు తెలంగాణ రావాలని, ఇది ఆటంకం కావద్దని సరే అన్నాం. తర్వాత చూసుకుందామని చెప్పినం.

ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రాగానే వెంటనే నీళ్ల పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్‌ వేయమన్నా వేయలే. మా పోరాటం, ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు” అని చెప్పారు. ‘‘అధికారం కోసం నోటికొచ్చింది చెప్పిన్రు. వరికి, పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్లు చెప్పిన 500 బోనస్‌  ఇయ్యరట. మరి అప్పుడు బోనస్​ ఇస్తమని ఎందుకు చెప్పిన్రు” అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు సంపూర్ణమైన వాటా వచ్చేదాక కొట్లాడతామన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని సూచించారు. ‘‘మీరు గెలిచిన్రు. ఐదేండ్లు అధికారంలో ఉండండి. మాకు అభ్యంతరంలేదు.

అపోజిషన్‌కు వచ్చిన. నాలుగు రోజులు ఆరంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏమి చేసిండ్రు. నల్లమొకం పిల్లిపోయి సచ్చిపోయిన ఎలుకను పట్టిందన్నట్టు.. కృష్ణా నీళ్లను కొంచబోయి కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిన్రు. మంచినీళ్లకు కూడా ఇక చిప్ప పట్టి అడుక్కోవాలి. మనకున్న అధికారాన్ని కొంచబోయి అప్పజెప్పిన్రు” అని మండిపడ్డారు. కేంద్రం తననూ బెదిరించిందని, కానీ తానూ అప్పజెప్పలేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పిచ్చిప్రేలాపనలు మాని, నీళ్ల వాటా తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్​ కోరారు.