
ధరణి ఎత్తేస్తే రైతుబంధు, రైతుబీమా రాదన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా సకాలంలో రావన్నారు. ధరణి ఎత్తేస్తే భూములపై హక్కులు కోల్పోతారని చెప్పారు. కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు..రైతులన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. రాహుల్ గాంధీకి ఎద్దు తెల్వదు..ఎవుసం తెల్వదన్నారు. రైతులు ఏ మోటారు వాడుతారో కూడా కాంగ్రెస్ నేతలకు తెల్వదన్నారు కేసీఆర్.
మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు బాహటంగా చెబుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఎన్నికలొస్తాయి పోతుంటాయి కానీ.. ఎన్నికల్లో ప్రజలు గెల్వాలన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశంలోనే నంబర్ వన్ అని చెప్పారు.
కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం,లంచాల రాజ్యం వస్తుందన్నారు సీఎం కేసీఆర్. మణుగూరులో రావాల్సిన వీటీపీఎస్ పై కుట్ర జరిగిందని.. సమైక్య వాదుల కుట్రతో విజయవాడలో స్థాపించారని తెలిపారు. రైతుబీమా ఇస్తున్నాం, పంటను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు సబ్సీడీ ఇస్తున్నామని.. రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు.
రైతులు బాగుపడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు కేసీఆర్. రైతుల కోసం ఇంత చేస్తున్న రాష్ట్రంలో మరొకటి లేదన్నారు కేసీఆర్. సంక్షేమం అభివృద్ది కావాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. రైతులు బాగుపడాలంటే బీఆర్ఎస్ నే గెలిపించాలన్నారు కేసీఆర్.