- కాళేశ్వరంతో నిజాంసాగర్‌కు పూర్వవైభవం
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయమిది
నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ప్రాభవం కోల్పోయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వవైభవం తెచ్చామని, ఇది తమ గవర్నమెంట్పదేండ్లలో సాధించిన విజయమని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేర్కొన్నారు.‘కాళేశ్వరం నీరు మల్లన్నసాగర్, సింగూర్ మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో చేరి నిండుకుండలా ఉంటోంది. భవిష్యత్తులో ఏడాదంతా ప్రాజెక్ట్ లో నీళ్లు ఉండేలా చూస్తానని హామీ ఇస్తున్నా. ఇక నుంచి పంటలకు ఢోకా ఉండదు’ అని అన్నారు. బుధవారం ఆయన బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.
‘1934లో నిజాం రాజు కట్టిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటితో పంటలు పుష్కలంగా పండేవి. అందుకే యావత్ తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ ప్రత్యేక నిలిచేది. అంతటి ఖ్యాతి ఉన్న ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ పాలకులు పట్టించుకోక, పంటలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. ఎగువ సింగూరునీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు తరలించి రైతులను మరింత గోస పెట్టారు. సింగూరు నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేసి, ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో నేను కూడా చాలాసార్లు పాల్గొన్న. ఇప్పుడా పరిస్థితి మారింది.
ఎండిన పంటల స్థానంలో పచ్చని పంటలు కనిపిస్తున్నయ్. గోదావరి జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు తీరుస్తున్నం. కాళేశ్వరం నీటితో నిజాంసాగర్ ఎప్పటికీ కళకళలాడుతుంది. గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలు పోయినా పట్టించుకోలే. ఆయన హయాంలో గజం కాలువ రిపేర్ చేయలే. ఎమ్మెల్యేగా షకీల్ రూ.72 కోట్లతో డిస్ర్టిబ్యూటరీ కెనాల్స్ బాగు చేయించారు.
జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్ వేశాం. ఆ పనులన్నీ కండ్ల ముందు కనబడుతున్నయ్’అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఇందూరు ఖ్యాతి ఉట్టిపడేలా రూ.55 కోట్లతో కళాభవన్ పనులు నడుస్తున్నాయని, భవన్ ప్రారంభోత్సవానికి తానే వస్తానన్నారు. జిల్లాను పోలీస్ కమిషనరేట్ స్థాయికి పెంచామని, నిజామాబాద్‌లో ఇంటెగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు నడుస్తున్నాయన్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన అర్బన్ అభ్యర్థి గణేశ్‌గుప్తాకు ప్రజల పైసలు అవసరం లేదని, ఆయన్ను గెలిపించి మరోసారి అసెంబ్లీకి పంపాలన్నారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి జంట నియోజకవర్గాలు
కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు జంట నియోజకవర్గాలు అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను కామారెడ్డికే కాదు, ఎల్లారెడ్డికి కూడా ఎమ్మెల్యే లెక్క చూడాలన్నారు. పోచారం ప్రాజెక్ట్‌లో ఎల్లప్పుడూ నీళ్లుండేలా చూస్తానన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తనకు తమ్ముడి లెక్క అని చెప్పారు.
రూ.3500 కోట్లతో అభివృద్ధి
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బోధన్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. వివిధ స్కీమ్‌ల కింద నియోజకవర్గ ప్రజల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమ చేశాం. బోధన్ ప్రజల డిమాండ్ మేరకు జేఎన్టీయూ, ఫార్మా కాలేజీ, ప్లే గ్రౌండ్ కోసం స్థలం కేటాయించాలి. సీఎం సభకు వేలాదిగా తరలివచ్చిన వారందరికీ ధన్యవాదాలు.
షకీల్ ఆమేర్, బోధన్ఎమ్మెల్యే
హిస్టరీ రిపీట్
గత పదేండ్లలో అర్బన్ నియోజకవర్గాన్ని సమూలంగా మార్చా. నగరంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. గతేడాది సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.వంద కోట్లతో అనేక సౌకర్యాలు కల్పించాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రజలు సంపూర్ణ సహకారం అందింది. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదించి హిస్టరీ రిపీట్చేయనున్నారు.
గణేశ్‌గుప్తా, అర్బన్ ఎమ్మెల్యే
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
కేసీఆర్ హయాంలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. తండాలను పంచాయతీలుగా మార్చడమే కాకుండా రోడ్లు కూడా వేశాం. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
రాష్ట్రమంతా గులాబీమయం
రాష్ట్రమంతా గులాబీమయం అయింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడు సార్లు సీఎం పదవి చేపట్టి కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డి పాత్ర శూన్యం. ఆయన ఆంధ్రా వలస పాలకులకు అండగా నిలిచారు.
ఎమ్మెల్సీ కవిత