
- మమ్మల్ని కాదు.. బీజేపోళ్లనే జైల్లో వేసుడు పక్కా
- వందశాతం ఢిల్లీల పంచాయితీ పెడ్త
- గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పెరిగింది
- దేశంలో నిరుద్యోగం ఎక్కువైంది: సీఎం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో దేశం సర్వనాశనం అవుతున్నదని, బీజేపీని, ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మాటి మాటికీ నన్ను జైలుకు పంపుతాం అనుడు కాదు.. దమ్ముంటే జైల్లో వేయాలె. జైలు అంటే దొంగలకు, లంగలకు భయం.. మేం ఫ్యూర్. ఈడీ, సీబీఐ పెడ్తం.. ఆగమాగం చేస్తం అంటే భయపడం. మమ్మల్ని మీరు జైల్లో ఏసుడు కాదు.. మేమే మిమ్మల్ని ఏస్తం” అని బీజేపీ నేతలను హెచ్చరించారు. మోడీకి ఇచ్చిన టైమ్ 80 శాతం అయిపోయిందని, ఇక ఆయన చేసేదేమీ లేదన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ లీడర్లు ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘పిచ్చి అబద్ధాలు..పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు. పరిస్థితి భయంకరంగా ఉంది. ఇట్లయితే దేశం ఉండదు. విదేశాలకు పోయి ఇవే అబద్దాలు చెప్తుంటే.. మన దేశం సిగ్గు పోతున్నది. 2025 నాటికి 5 ట్రిలియన్ ఎకానమి చేస్తాం అంటున్నరు. అది చంద్రయాన్ మీద పోయినదానితో సమానం అంటరు. మనం కూడా చంద్రమండలంపై దిగినట్టే అనుకోవాలే ఇగ. అసలు 5 ట్రిలియన్ ఎకానమీ అవడంలో గొప్ప ఏమీ లేదు. మీకు సత్తా ఉంటే చైనా, సింగపూర్ తరహాలో చేయాలె. అంతే తప్ప 5 ట్రిలియన్ ఎకానమీ పెద్ద గొప్ప కాదు” అని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలోని భయంకరమైన అవినీతి ఆధారాలు నా దగ్గరకు వస్తున్నయ్. రాఫెల్ డీల్‌లో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్తే ఆయనను కిందమీద చేసిన్రు. రాఫెల్ డీల్‌లోని అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్త. నేను చెప్తున్నా బీజేపీ వాళ్లు రాఫెల్ జెట్స్ డీల్‌లో వేల కోట్లు మింగిన్రు.. బీజేపీ 36 రాఫెల్ జెట్స్‌ను 9.4 బిలియన్ డాలర్లకు కొంటే, ఇండోనేషియా 42 రాఫెల్ జెట్స్‌ను 8 బిలియన్ డాలర్లకే కొన్నది. ఎవరు దొంగ అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఈ కుంభకోణాలన్నీ బయటపడితే, ఎవరు జైలుకు పోవాల్నో, వారు పోతరు. వంద శాతం ఢిల్లీల పంచాయితీ పెడ్త’’ అని హెచ్చరించారు.
కిషన్రెడ్డీ.. ఇంకోసారైతే హార్ష్‌గా సమాధానమే
కేంద్ర బడ్జెట్‌పై చర్చకు నేను సిద్ధంగా ఉన్న. బీజేపోళ్లకు దమ్ముందా”అని కేసీఆర్ సవాల్ విసిరారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఏం పంచాయతీ లేదు. బడ్జెట్‌ను నేను అర్థం చేసుకోలేదని ఆయన చెప్తుండు. ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ తగ్గించడం అబద్దమా? కిషన్‌రెడ్డికి అర్థంగాక గాలిపుడీలు మాట్లాడితే ఎట్లా? 40 వేల కోట్ల మంది దళితులకు మీరు బడ్జెట్ పెట్టింది రూ. 12,800 కోట్లు.. మనిషికి రూ.300 వస్తయ్. ఈ బడ్జెట్‌తో అయ్యేది తుపాకి రాముని ప్రగతే” అని దుయ్యబట్టారు. ఇప్పుడైతే కిషన్‌రెడ్డికి మర్యాదగా చెప్తున్నానని, ఇంకోసారి తప్పుగా మాట్లాడితే చాలా హార్ష్‌గా సమాధానం ఇస్తానని ఆయన హెచ్చరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చదువు వస్తదో రాదో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చదువు వస్తదో రాదో నాకు తెల్వదు. చదివినా అర్థమైతదో లేదో పాపం...గరీబ్ గాడు.. ఆయన మాటలతో ఆ పార్టీ పరువు పోతున్నది. ఆయనకు బదులు ఇంకెవరితోనైనా మాట్లాడించాలె” అని కేసీఆర్ విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరిట విద్యుత్ వ్యవస్థను మోడీ దోస్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకముందే విద్యుత్ సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద ఒత్తిళ్లు తెస్తోందని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 0.5 శాతం పెంచుతామని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళంలో 25 వేల మీటర్లు బిగించిందని, మన రాష్ట్రంలో మాత్రం మీటర్ల బిగింపును ఒప్పుకోబోమని చెప్పారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీ లీడర్లు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలోనూ మోడీ అబద్దాలే చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. మోడీ స్పీచ్‌ను ట్యాబ్‌లో మీడియాకు కేసీఆర్ వినిపిస్తూ ‘‘సఫేద్ జూట్.. జూట్ నిర్భర్ భారత్’’ అంటూ దుయ్యబట్టారు.
బీజేపీ పాలనలో అవినీతి కంపు
బీజేపీ పాలనలో దేశం అవినీతి కంపు కొడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైళ్లు, బ్యాంకులు, విమానాలు, ఎల్‌ఐసీ వంటివి అన్నింటిని కార్పొరేట్ గద్దలకు అమ్ముతున్నారని, ఆఖరుకు కరెంట్‌ను కూడా అమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ విధానాలతో పేదలు ఇంకా పేదరికంలోకి కూరుకుపోతే, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని అన్నారు. ‘‘77% సంపద పది శాతం మంది వద్దే ఉన్నది. మిగిలిన 90% మంది వద్ద ఉన్నది 23 శాతమే. ఈ ప్రభుత్వంలో పేదలు ఇంకా పేదలు అవుతున్నారు. ఎన్‌ఎస్‌వో లెక్కల ప్రకారం దేశంలో నిరుద్యోగిత పెరిగింది. తెలంగాణలో నిరుద్యోగం రేటు 0.3% ఉంటే.. దేశంలో 7% ఉన్నది. ఇదేనా మోడీ పాలనకు నిదర్శనం? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? బీజేపీ పాలనలో 33 మంది ఎగవేతదారులు విదేశాలకు పారిపోయిన్రని ప్రభుత్వమే పార్లమెంటుకు రిపోర్ట్ ఇచ్చింది. వీళ్లంతా మోడీ దోస్తులే.. ఎక్కువమంది గుజరాతీలే. అందుకే బీజేపీ మస్ట్ గో అని చెప్తున్న. ఎవడైనా మొగోడు ఉంటే వీటి మీద మాట్లాడాలె.. దీని మీద చర్చించడానికి ఎవరైనా వస్తరా?” అని కేసీఆర్ సవాల్ విసిరారు. ‘‘వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల ప్రపంచస్థాయిలో దేశం ఇజ్జత్ పోతున్నది” అని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు పోరాడుతున్నారని, సింగరేణిలో కేంద్రం వాటాకు అవసరమైతే డబ్బులు చెల్లిస్తామని కూడా తాము చెప్పామని తెలిపారు. వాజ్‌పేయి ఉన్నప్పుడు ఆ పార్టీకి కొంత సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడు ఏదీ లేదని దుయ్యబట్టారు. కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలవకపోయినా, దొడ్డిదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన చేపట్టిందని విమర్శించారు. మహారాష్ట్రలో కూడా ప్రయత్నించి ఎల్లెల్కల పడ్డరని అన్నారు. యూపీ ఎన్నికల తెల్లారే పెట్రోల్ రేటు పెంచుతరని అన్నారు.
అమెరికా ఎలక్షన్‌లో మోడీ ప్రచారమేంది?
‘‘మోడీ అమెరికా ఎందుకు పోయినట్టు? హౌడీ మోడీ అని పోయిండు. అక్కడి ఎన్నికలతో మనకేం సంబంధం? అవేమన్నా అహ్మదాబాద్‌లో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలా? అక్కడికి పోయి అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అన్నడు. మరేమైంది. మళ్లీ ట్రంప్ గెలిచిండా?” అని కేసీఆర్ దుయ్యబట్టారు. మోడీ ఇప్పుడు అమెరికా వెళ్తే ఎట్లాంటి ఆహ్వానం లభిస్తుందో ఆలోచించుకోవా లన్నారు. వైట్‌హౌస్‌కు పోతే సరైన ఆదరణ లభించడం లేదని చెప్పారు. ‘‘ప్రధాని మోడీ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఇద్దరు మనుషులకు కరోనా వచ్చింది. అందుకే మోడీని ఆహ్వానించడానికి వెళ్లలేదు” అని సీఎం చెప్పారు.
బీజేపీ హయాంలో గవర్నర్ల వ్యవస్థ మంచిగ లేదు
గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, సరిగ్గా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పింది. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం బీజేపీ పాలనలో పెరిగింది. ఇది మంచిది కాదు” అని కేసీఆర్ అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీని వెళ్లగొట్టాలని, భవిష్యత్ రాజకీయాలను ఊహించి చెప్పలేమని, బీజేపీ అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలని పేర్కొన్నారు. అస్సాం సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కాదు.. రాహుల్ గాంధీపై చేసిన నిందను ఖండిస్తున్న. ఒక్క రాహుల్‌గాంధీ పైనే కాదు. ఎవరిపైనా ఇట్లా మాట్లాడొద్దు. నేను ఇట్లా ఎప్పుడూ మాట్లాడ. నేను కమ్యూనికేట్ చేయాలనుకున్న విషయం అర్థమయ్యేలా హార్ష్‌గా చెప్త” అని కేసీఆర్ పేర్కొన్నారు.
అవసరమైతే కొత్త పార్టీ
దేశం కోసం అవసరమైతే కొత్త పార్టీ పెడుతానని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘అందరి కోరిక అయితే కొత్త పార్టీ పెడితే తప్పేమీ లేదు” అని చెప్పారు. ‘‘ఆ ఫ్రంట్.. పార్టీల ఫ్రంట్.. యునైటెడ్ ఫ్రంట్.. రాజకీయ ఫ్రంట్ అని ఊహించొద్దు... ప్రజల ఫ్రంట్‌ను ఊహించండి. పీపుల్స్ ఫ్రంట్.. అందులో నేను మేజర్ రోల్ ప్లే చేస్త.. ఏం జరుగుతుందనేది చెప్పడానికి నేను జ్యోతిషుడిని కాదు..
నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయితడునుకున్నడా.. నేను పుట్టంగనే సీఎం అయితనని అనుకున్ననా? మల్లారెడ్డి పాలమ్ముకొని కష్టపడి మంత్రి అయిండు. నేను ముంబై పోతా.. ఉద్ధవ్ థాక్రేను కలుస్త” అని ఆయన తెలిపారు.
దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలన్నా
దళిత సంఘాలకు, రాజ్యాంగానికి సంబంధం ఏంది? రాజ్యాంగంపై నేను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్న. కొత్త రాజ్యాంగం కావాలె. తప్పేముంది?” అని కేసీఆర్ ప్రశ్నించారు. దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని అన్నారు. ‘‘పక్కన ఉన్న చైనాలాగా మనం కూడా కావాలె.. చిప్పపట్టుకొని ఎన్ని రోజులు తిరుగుదాం? దేశం అనుకున్న పద్ధతిలో చైనా, సింగపూర్ మోడల్‌లో ముందుకు పోవాలంటే పాత చింతకాయపచ్చడితో జరగదు.. కొత్త మార్గం పట్టాల్సిందే. తెలంగాణ లెక్క దేశం మారడానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్న. దేశంలో దళితుల జనాభా 19శాతానికి పెరిగింది.. దళితులకు రిజర్వేషన్లు 19 శాతానికి పెంచాలని రాజ్యాంగం మార్చమంటున్న.. తప్పా? దేశమంతా దళిత బంధు కోసం, ఎస్సీ సబ్‌ప్లాన్ కోసం, బీసీల జనాభా లెక్కలు తీయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్న. రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేద్కర్ చెప్పారు. దేశంలో అంబేద్కర్ స్పిరిట్ ఇంప్లిమెంట్ అయితలేదు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది.. ఈ దుర్మార్గం పోవడానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్న. రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలి.. అంబేద్కర్ స్పిరిట్ ఉండాలి.. ఆర్థిక ప్రగతి వైపు దేశాన్ని నడిపించే రాజ్యాంగం కావాలంటున్న ” అని కేసీఆర్ పేర్కొన్నారు.
సర్జికల్ స్ట్రయిక్స్‌పై నాకూ అనుమానాలున్నయ్
సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్టు ఆధారాలు ఇవ్వాలని అడగడంలో తప్పేముందని కేసీఆర్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రయిక్స్‌పై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని, తాను కూడా ఆధారాలు ఇవ్వాలని అడుగుతున్నానని అన్నారు. బీజేపీ చాలా ఘోరమైన భాష వాడుతున్నదని, వాళ్ల మాటలు చూస్తే చాలా బాధనిపిస్తున్నదని చెప్పారు. ‘‘మనసుకు ఏది వస్తే అది మాట్లాడుతున్నరు. దేశంలో విద్వేషం రెచ్చగొడుతున్నరు. మతం పేరుతో, దేవుని పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు. మోడీ స్వయంగా రాజ్యసభలో కాంగ్రెస్ వాళ్లను అర్బన్ నక్సలైట్లు అన్నరు. రాహుల్ గాంధీని అస్సాం సీఎం ఇష్టం వచ్చినట్లు అన్నరు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంలోని వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడుతరా? రాహుల్ ముత్తాత దేశ స్వాతంత్రం కోసం జైలుకు పోయిన్రు. రాహుల్ నాన్నమ్మ, తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించిన్రు. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని నీ తండ్రి ఎవరు అని అడుగుతరా” అని ప్రశ్నించారు.
ఈ నెలఖారులో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
ఈ నెల చివరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నదని సీఎం చెప్పారు. మీడియాతో మాట్లాడిన తరువాత ఆయన కాసేపు రిపోర్టర్లతో చిట్ చాట్ చేశారు. ఈసారి రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చిందని, అదే అంచనాలతో బడ్జెట్ సైజు 2 లక్షల కోట్లు దాటుతుం దన్నారు. కొత్త రాజ్యాంగంతో పాటు జాతీయ అంశాలపై రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లతో త్వరలో మీటింగ్ ఉంటుందని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం