
- కాళేశ్వరం బ్యారేజీల అదనపు పనులకు
- ముందుగానే నిధులు ఇవ్వాలన్నారు
- జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ వెల్లడి
- బ్యారేజీలకు ఎంత ఖర్చయిందనిప్రశ్నించిన కమిషన్..
- రూ.9 వేల కోట్ల వరకు ఖర్చై ఉంటుందన్న మురళీధర్
- డీపీఆర్‌లో రూ.13,559 కోట్లతో అంచనాలిచ్చారని కమిషన్ ఫైర్
- బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయాలని చెప్పింది కేసీఆరే: నల్లా వెంకటేశ్వర్లు
- వ్యాప్కోస్ డీపీఆర్ ఖర్చు 649 కోట్లు కాదు.. 19 కోట్లేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అదనపు పనులకు సంబంధించి నిర్మాణ సంస్థలకు 60 శాతం డబ్బులను అడ్వాన్స్‌గా చెల్లించేందుకు నాటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని రిటైర్డ్ ఈఎన్సీ జనరల్ మురళీధర్ వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రొక్యూర్‌మెంట్లకు ఆ నిధులను వాడుకునేందుకు అవకాశమిచ్చారని తెలిపారు. అదనపు పనులకు అయిన అదనపు ఖర్చులను రీయింబర్స్ చేసుకోవడానికీ అవకాశం ఇచ్చారని చెప్పారు. అటవీ భూముల్లో చెట్లు కట్‌చేయడానికి యంత్రాలను సమకూర్చుకునేందుకు, ఇతర అవసరాలకు ఆ నిధులను వాడుకునేలా హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
అంతేగాకుండా బ్యారేజీల వద్ద ముంపు సమస్యను పరిష్కరించడానికి ఫ్లడ్బ్యాంకులపై స్టడీ చేయాలని ఆదేశించారన్నారు. గురువారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైపవర్కమిటీ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌లోని 13, 15 క్లాజులను ఆయనచదివి వినిపించారు. మురళీధర్‌తో పాటు రిటైర్డ్ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, ఈఎన్సీ హరిరామ్‌లనూ ఓపెన్‌కోర్టులో కమిషన్చైర్మన్జస్టిస్పినాకి చంద్రఘోష్విచారించారు.
అగ్రిమెంట్ కండీషన్లు మార్చారా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఎంత ఖర్చయిందని కమిషన్ ప్రశ్నించగా.. రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు ఖర్చయిందని మురళీధర్ చెప్పారు. అయితే వ్యాప్కోస్ డీపీఆర్‌ను చూపించిన జస్టిస్ ఘోష్.. రూ.13,559 కోట్ల అంచనాలతో డీపీఆర్ ఇచ్చారని పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 9న ఆనాటి సీఎం అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో ఏజెన్సీలతో అగ్రిమెంట్ కండీషన్లను మార్చారా? అని ప్రశ్నించగా.. అవునని మురళీధర్సమాధానమిచ్చారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్‌ను మార్చడానికి ముందు వ్యాప్కోస్‌తో చర్చించారా? అని ప్రశ్నించగా.. అవునని, అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రం లేవని చెప్పారు. అయితే దీనిపై వ్యాప్కోస్‌కు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదని మురళీధర్‌కు కమిషన్ చురకలు అంటించింది. అదనపు పనులు అంటే ఏంటి? అని ప్రశ్నించగా.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమయ్యే ఎక్స్‌ట్రా పనులని ఆయన బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డీటెయిల్డ్ఇన్వెస్టిగేషన్స్కు సంబంధించి వ్యాప్కోస్‌కు అప్పగించాలని ఎవరు ఆదేశించారని కమిషన్ప్రశ్నించింది. నామినేషన్ పద్ధతిలో వ్యాప్కోస్‌కు అప్పగించేందుకు నాటి సీఎం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందిగా సెక్రటరీకి తానే లేఖ రాశానని మురళీధర్ తెలిపారు.
డిజైన్లు ఆలస్యమైతే మీరేం చేశారు?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్‌లు ఆలస్యమైతే.. మీరేం చేశారని రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును కమిషన్ ప్రశ్నించింది. సెంట్రల్డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ డిజైన్లను లేట్చేయడం వల్లే సమస్యలు తలెత్తాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు కదా.. మరి, డిజైన్లను త్వరగా ఇవ్వాలని సీడీవో సీఈకి లేఖ ఏమైనా రాశారా? అని ప్రశ్నించింది. దానికి రాశానని వెంకటేశ్వర్లు చెప్పడంతో.. ‘అసలు ఏ లెటర్ కూడా మీరు రాయలేదు’ అంటూ కమిషన్ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత వెంకటేశ్వర్లు కూడా తాను ఏ లేఖా రాయలేదని ఒప్పుకున్నారు.
డిజైన్లు లేట్ అవుతుండడంపై ఇరిగేషన్ ప్రిన్సిపల్సెక్రటరీ, హైపవర్కమిటీ, ఈఎన్సీలకు లెటర్ ఏమైనా రాశారా? అని ప్రశ్నించగా.. లేదు అని బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల్లో 2డీ, 3డీ మోడల్ స్టడీస్ కండక్ట్ చేయాలని 2016 అక్టోబర్18న టీఎస్ ఈఆర్ఎల్‌కు లేఖ రాశారు కదా.. మరి, ఆ తర్వాత ఈఆర్ఎల్‌కు ఈ విషయంపై మరోసారి ఏమైనా లేఖ రాశారా? అని కమిషన్ ప్రశ్నించింది. దానికి లేదు అని బదులిచ్చారు. అసలు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించగా.. నాటి సీఎం, ఇరిగేషన్‌శాఖ మంత్రులే ఆదేశించారని తెలిపారు. ఆనాడు సీఎం కేసీఆరే ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.
పనులు ఆలస్యమైతే పెనాల్టీలు వేయరా?
బ్యారేజీల పనులను ఆలస్యం చేసిన నిర్మాణ సంస్థలకు ఎప్పుడైనా పెనాల్టీ వేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు. అయితే పనులు ఆలస్యం చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పెనాల్టీ వేయకపోవడం ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చడం కిందికి రాదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణానికి స్థలాలను ఇచ్చే ముందు ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నారా? అని ప్రశ్నించగా.. దానికి ప్రత్యేకంగా ఎలాంటి అగ్రిమెంట్ అవసరం లేదని సమాధానమిచ్చారు. ప్రాజెక్టు సీఈగా దాని పర్యవేక్షణ, ఓఅండ్‌ఎం బాధ్యత మీది కాదా? అని కమిషన్ప్రశ్నించగా.. ఆ బాధ్యత తనది కాదని, పనులు అప్పగించాక నిర్మాణ సంస్థలే చూసుకోవాలని చెప్పారు. వ్యాప్కోస్ డీపీఆర్‌కు రూ.649 కోట్లు ఖర్చయినట్టు చెబుతున్నారు కదా.. నిజమేనా? అని ప్రశ్నించగా.. రూ.19 కోట్లే ఖర్చయిందని బదులిచ్చారు. అసలు వ్యాప్కోస్ఇచ్చిన డీపీఆర్‌ను ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక టైమ్ ఇచ్చేది లేదు..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటైన ఎక్స్పర్ట్కమిటీకి ఏవైనా లేఖలు రాశారా? అని ఈఎన్సీ హరిరామ్‌ను కమిషన్ ప్రశ్నించింది. అసలు ఎక్స్పర్ట్కమిటీని ఏర్పాటు చేశారన్న విషయమూ మీకు తెలియదా? అని నిలదీసింది. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి 2015 జనవరి 31న సీడబ్ల్యూసీకి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అథారిటీ నుంచి, 2015 మార్చి 4న సీడబ్ల్యూసీ నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాశారా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, మూడ్రోజులు సమయమిస్తే జీవో 28ను పరిశీలించి సమాధానం చెబుతానని హరిరామ్చెప్పారు.
అయితే, ‘ఇకపై ఎలాంటి సమయమూ ఇచ్చేది లేదు. మీరు ఎలాంటి కమ్యూనికేషన్చేయలేదు’ అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఏ విధంగానూ సంబంధం లేదా? అని ప్రశ్నించగా.. ఎలాంటి సంబంధం లేదని బదులిచ్చారు. రెవెన్యూ జనరేషన్కోసం కాళేశ్వరం కార్పొరేషన్‌తో ఇండస్ట్రీలు ఒప్పందాలు చేసుకున్నాయా? ప్రశ్నించగా.. దానికి సంబంధించిన రికార్డులేవీ లేవన్నారు. కాగా, వ్యాప్కోస్డీపీఆర్లో కేవలం సాధారణ డ్రాయింగ్‌లు మాత్రమే ఇచ్చిందని రిటైర్డ్ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. వ్యాప్కోస్ఇచ్చిన డిజైన్లపై కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ 2015 జులై 17న మీకు లేఖ రాశారా? దానికి మీరు రిప్లై ఇచ్చారా? అని కమిషన్ ప్రశ్నించగా.. తొలుత గుర్తులేదని, ఆ తర్వాత తాను రిప్లై ఇచ్చానని ఆయన సమాధానమిచ్చారు.