తెలంగాణకు రా.. మోడీ! నేర్చుకుని పో : కేసీఆర్
మహబూబ్ నగర్ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు సీఎం కేసీఆర్. ఇవాళ నాగర్ కర్నూలు(వనపర్తి), మహబూబ్ నగర్ లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో గులాబీ బాస్ పాల్గొన్నారు.
“కేసీఆర్ జ్యోతిష్యం నమ్ముతాడు అని మోడీ విమర్శ చేశారు. పీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. నేను ఏది నమ్మితే ఆయనకేంది. జనం బతుకులు మార్చడం గురించి ఆలోచన చేయాలి. అభివృద్ధి జరగాలి. మోడీ నువ్వు తెలంగాణకు రా. వచ్చి అభివృద్ధి ఏంటో చూసి నేర్చుకో. మా రైతుబంధు కాపీ కొట్టినవ్. మేం నీళ్లు ఎట్లా ఇస్తున్నమో చూడు. మేం కరెంట్ ఎట్లా ఇస్తున్నమో తెల్సుకో. అప్పుడు మాట్లాడు” అని కేసీఆర్ అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహాత్మక దాడులని చెప్పిన కేసీఆర్.. వాటిని రాజకీయాలకు వాడుకోవడం పద్ధతి కాదన్నారు. ప్రధానమంత్రి కేబినెట్ లో కూర్చున్నప్పుడు మంత్రులతో ఈ విషయాలు చెబుతారనీ.. ఆ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలన్నారు.
“లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు దాటదు. కాంగ్రెస్ 100 సీట్లలోపే. ఈ రెండు కలిసినా అధికారంలోకి రాలేవు. వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే. ప్రకాశ్ అంబేద్కర్ మాతో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ మాతో ఉన్నారు. డీఎంకే స్టాలిన్ మాతో ఉన్నారు. ఇంకా చాలామంది నాయకులు కూటమిలో భాగం కాబోతున్నారు. రాష్ట్రాల హక్కులు ప్రాంతీయ పార్టీల కూటమితోనే రక్షించబడతాయి” అన్నారు కేసీఆర్.
వచ్చే జూన్, జులైలో రెవెన్యూ చట్టం వస్తుందనీ… రైతులకు బాధలు లేకుండా చేసేదాకా తాను నిద్రపోనని అన్నారు కేసీఆర్. రైతుల గొంతుక కేసీఆర్ అన్నారు. రైతు భూమి రైతుకే ఉండాలన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని వివరించారు. బంగారు భారతదేశంకోసం తన రక్తం ధారపోస్తా అని కేసీఆర్ చెప్పారు.