‘‘ దేశంలో ఏ ప్రధాని కూడా తీసుకోని దుర్మార్గమైన నిర్ణయాలను మోడీ తీసుకుంటున్నరు. చేనేత ఉత్పత్తులపై మోడీ 5 శాతం జీఎస్టీ వేస్తున్నరు. ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఇక్కడి చేనేత కార్మికులు ఓట్లు వేయాలా ? ’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న దుష్ట పాలనపై వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి పోరాటం చేస్తున్నయని చెప్పారు. విద్యుత్ సంస్కరణల ముసుగులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. బీజేపీ బలోపేతం అయితే దేశంలో వ్యవసాయ రంగం మరింత దెబ్బతినే గండం ఉందని పేర్కొన్నారు. చండూరు బంగారిగడ్డలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ముచ్చర్ల సత్యనారాయణ వాజ్ పేయి దగ్గరికి వెళ్లినప్పుడు..
బీజేపీ వాళ్లు రూ.100 కోట్లు పెట్టి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిండ్రని కేసీఆర్ ఆరోపించారు. ‘‘ గతంలో ముచ్చర్ల సత్యనారాయణ జలసాధన సమితి పేరుతో మునుగోడు ఫ్లోరైడ్ సమస్యపై పోరాడారు. అప్పట్లో వాజ్ పేయి దగ్గరికి వెళ్లి వినతి చేశారు. అయినా పట్టించుకోలేదు. మునుగోడు దిక్కుకు ఎవ్వరూ రాలేదు. ఫారినర్లకు మునుగోడు ఫ్లో రైడ్ సమస్యను ఎగ్జిబిషన్ లాగా చూపించారే తప్ప సమస్యను తీర్చలేదు’’ అని కేసీఆర్ గుర్తు చేశారు. ‘‘ చూడు చూడు నల్లగొండ.. ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నయి రా జెండాలెన్నో.. అంటూ మునుగోడు ఫ్లోరైడ్ సమస్యలను అద్దంపట్టే పాటలను నేనే రాశాను. ఇక్కడి సమస్యలపై ఉన్న అవగాహన వల్లే అది సాధ్యమైంది. మునుగోడులోనే ఉండి ఇక్కడి సమస్యలపై గతంలో అధ్యయనం చేశాను. ప్రజల బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. అందుకే సీఎం కాగానే మునుగోడు ప్రజల దాహార్తిని తీర్చాను’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
నాకు మంచి సద్ది కట్టండి
‘‘ఒకనాడు సిద్దిపేటలో బై పోల్ వచ్చినప్పుడు నన్ను భారీ మెజారిటీతో అక్కడి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కూడా గెలిపించి, నాకు మంచి సద్ది కట్టండి. మునుగోడును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నియోజకవర్గంలో అద్దంలాంటి రోడ్లు వేయిస్త. దేశంలో భారీ మార్పును తెచ్చేందుకు, బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు బాటలు వేసేందుకు ఒక గొప్ప అవకాశం మునుగోడు ప్రజలకు దక్కింది. ఓటుతో చారిత్రక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం మునుగోడు ప్రజలకు దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంక్షేమ పాలన కోరుకునే వాళ్లంతా టీఆర్ఎస్ కు ఓటు వేయాలి. యావత్ భారత దేశానికి అన్యాయం చేస్తున్న జెండాలను గుర్తుపట్టాలి’’ అని కేసీఆర్ అన్నారు.