దళిత బంధు..ఫ్యామిలీకి రూ.10లక్షలు

దళిత బంధు..ఫ్యామిలీకి రూ.10లక్షలు
  • ‘దళిత బంధు’ స్కీంను ప్రకటించిన సీఎం కేసీఆర్​
  • పైలట్​ ప్రాజెక్టుగా హుజూరాబాద్​ నియోజకవర్గం ఎంపిక
  • ఈ సెగ్మెంట్​లో 20,929 కుటుంబాలకు రూ. 2 వేల కోట్లు
  • పథకం అమల్లో అలసత్వం వహిస్తే సహించబోమని అధికారులకు హెచ్చరిక

 

ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే  ఆధారంగా దళిత బంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. తమ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలో 4346,  వీణవంకలో 3678 , జమ్మికుంటలో 4996 , ఇల్లందకుంట మండలం లో 2586 కుటుంబాలు..  మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు స్కీంకు ఇప్పటికే రూ.1200 కోట్లను ప్రకటించామని, పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్​ నియోజకవర్గానికి రూ. 1500 కోట్ల నుంచి 2 వేల కోట్లు ఇస్తామని ఆయన చెప్పారు. దీని ప్రకారం 20,929 కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అనర్హులను తీసేస్తే ప్రతి ఫ్యామిలీకి రూ.10 లక్షల చొప్పున లబ్ధి చేకూరనుంది. 

హైదరాబాద్​, వెలుగు: త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్​ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్​ వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. ‘తెలంగాణ దళిత బంధు’ స్కీం కింద ఈ నియోజకవర్గాన్నే పైలట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయని, వారికోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ లెక్కన నియోజకవర్గంలోని దాదాపు ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందనున్నాయి. ‘దళిత సాధికారత అమలు,  పైలట్ ప్రాజెక్టు ఎంపిక’ అనే అంశంపై ఆదివారం ప్రగతి భవన్​లో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ స్కీంగా పేరు పెడుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారం చేసుకుని దళిత బంధు పథకం అమలులో ముందుకు సాగాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. 

ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తం

తెలంగాణ దళిత బంధు స్కీం ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం  చెప్పారు. గతంలో తాను​ అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించానని, అలాగే దళిత బంధు స్కీంకు కూడా అదే జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. పైలట్​ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన నియోజకవర్గంలోని దళిత కుటుంబాల స్థితిగతులను తెలుసుకొని, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. దళారుల బాధ లేకుండా దళితుల అకౌంట్లలో నేరుగా రూ. 10 లక్షల చొప్పున వేస్తామని సీఎం​ చెప్పారు. 

హుజూరాబాద్​కు ఇప్పటికే రూ. 365 కోట్లు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న రూలింగ్​పార్టీ  నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్నేళ్లుగా మూలనపడ్డ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు ఇటీవలే ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఇక హుజూరాబాద్ పట్టణానికి రూ. 35 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.30 కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​ మంజూరు చేశారు. ఇప్పటికే సీసీరోడ్లు, డివైడర్లు, చౌరస్తాల బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు వివిధ గ్రామాల్లో తిరిగి కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘాల భవనాలు, ఫంక్షన్​హాళ్లు,  సీసీ రోడ్లు శాంక్షన్​ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయా అభివృద్ధి పనులకు సుమారు రూ. 300 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించారు. దీంతోపాటు అత్యధిక మందిని ప్రభావితం చేసేలా కొత్త పింఛన్లు, రేషన్ కార్డులకు మరోసారి అప్లికేషన్లు తీసుకుంటున్నారు.

దళారుల బాధ లేకుండా దళితుల అకౌంట్లలో నేరుగా రూ. 10 లక్షల చొప్పున వేస్తామని సీఎం​చెప్పారు. ఇటీవల నిర్వహించిన దళిత ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్ణయించినట్లే ఆయా కుటుంబాలకు తమకు ఇష్టమైన పని ఎంచుకుని అభివృద్ధి చెందే వెసులుబాటును కల్పిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు అమలులో కలెక్టర్ల తో పాటు ఎంపిక చేసిన ఆఫీసర్లు పాల్గొంటారని, ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలను పరిశీలిచాక రాష్ట్రవ్యాప్తంగా స్కీం అమలు చేస్తామని పేర్కొన్నారు. పైలెట్​ ప్రాజెక్టులో పాల్గొనబోయే ఆఫీసర్లకు త్వరలోనే వర్క్ షాప్  నిర్వహిస్తామన్నారు. పథకం అమలుకు ప్రేమాభిమానాలున్న ఆఫీసర్లను గుర్తించాలి. దళితుల సమస్యలు అన్ని చోట్లా ఒకే రీతిలో ఉండవని, రూరల్​, సెమీ అర్బన్, కంప్లీట్​అర్బన్ అనే విభాగాలుగా చేసుకొని, అందుకు తగ్గట్టుగా దళిత బంధు స్కీం అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు దళిత కుటుంబాల ప్రొఫైల్ ను రూపొందించాలని, ఇందులో ఆయా ఫ్యామిలీల జీవన స్థితిగతులను పూర్తిస్థాయిలో పొందుపరచాలన్నారు. దళిత బంధును పాత పథకాల మాదిరి మూస పద్ధతిలో కాకుండా మనసుపెట్టి అమలు చేయాలని, ఇందుకోసం దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న ఆఫీసర్లను గుర్తించాలని చెప్పారు. స్కీం ఇంప్లిమెంటేషన్​, మానిటరింగ్​ఎంత ముఖ్యమో, స్కీం రిజల్ట్​ అంచనా వేయడం,  లబ్ధిదారులు,  ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అంతే ముఖ్యమన్నారు. అందుకే లబ్ధిదారునికి నేరుగా రూ. 10 లక్షలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారుడు, ప్రభుత్వ  భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయాలని, లబ్ధిదారులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందించాలని ఆయన సూచించారు. 

తాదాత్మ్యం చెంది పనిచేయాలి

కులం, జెండర్, ఆర్థికం తదితర పేర్లతో వివక్ష చూపడం,  ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం వల్ల జాతికి ఎనలేని నష్టం జరుగుతుందని సీఎం అన్నారు. ఈ వివక్షను తొలగించి, దళితుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు స్కీం తెస్తోందని చెప్పారు. ‘‘మనం తిండి తింటున్నప్పుడు ఎంతైతే లీనమై రసించి భోజనం ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంతైతే దీక్ష కనబరుస్తామో దళిత బంధు పథకం అమలులో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది పనిచేయాలి. తమ అభివృద్ధి గురించి, గత పాలకులు అవలంభించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడింది. వారిలో గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలగిపోవాలి. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన అవసరం మనమీదున్నది” అని అన్నారు. దళిత బంధు పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1,200 కోట్లతో అమలైతది. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా ఈ స్కీమ్​ను అమలు చేస్తం. ఇందుకోసం అదనంగా మరో రూ. 1,500 కోట్ల నుంచి 2,000 కోట్లు  హుజూరాబాద్​లో ఖర్చు చేస్తం.
- సీఎం కేసీఆర్