- = మనసు మార్చుకున్నమాజీ సీఎం కేసీఆర్?
- = ప్రజలతో గ్యాప్ వచ్చిందంటున్న కేటీఆర్
- = వరుస వలసలతో సెంటిమెంట్ రాజేసే యత్నం
- = కొత్త స్కెచ్ కు తెరలేపిన కారు పార్టీ
హైదరాబాద్: జాతీయ రాజకీయాలంటూ పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీ పీఛేముడ్ అననుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పేరిట ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఓటమి.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు చెందిన శ్రీగణేశ్ గెలుపుతో.. బీఆర్ఎస్ బలం కాస్తా.. 38కి పడిపోయింది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం 15 చోట్ల మూడోస్థానానికి పడిపోవడం.. చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో కారు పార్టీ ఉక్కిరి బిక్కిరయ్యింది.
గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా హస్తం పార్టీలో చేరారు. వరుస వలసలు గులాబీ అధినేతకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇవాళ తనతో సమావేశానికి హాజరైన వారు తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుండడాన్ని గులాబీ బాస్ జీర్ణించుకోలేక పోతున్నారట. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కలిసొచ్చిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా ప్రజలతో గ్యాప్ ఏర్పడిందని పార్టీ నాయకత్వం భావిస్తున్నదని సమాచారం. ఇవాళ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
సెంటి‘మంట’రగిలించి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్.. మళ్లీ సెంటిమెంట్ రగిలించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలతో ఏర్పడ్డ గ్యాప్ ను ఫిల్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
తాము చేసిన అభవృద్ది కన్నా సెంటిమెంటే విజయతీరాలకు నడిపిస్తుందని గులాబీబాస్ గట్టిగా నమ్ముతున్నారని సమాచారం. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడం ప్రజలు పార్టీని ఓన్ చేసుకుంటారని కేసీఆర్ అనుకుంటున్నారని తెలుస్తోంది. విభజన అంశాలను, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తెరమీదకు తెచ్చి పార్టీని ప్రజల్లో ఉంచేందుకు టీఆర్ఎస్ గా మార్చడమే ఏకైక పరిష్కారమని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ALSO READ | మా పార్టీలోకి 12 మంది వస్తే..10 మంది ఓడిపోయిండ్రు : హరీశ్ రావు