
హైదరాబాద్, వెలుగు: ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన డూప్లికేట్ గాంధీ కామెంట్లపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే గౌరవముంది కానీ, ఈ వయస్సులో ఆయన ఇంత దిగజారి మాట్లాడటం అవసరమా? అని మండిపడ్డారు.
సోనియా గాంధీ, రాహుల్‌గాంధీకి కేసీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నినాదం నుంచి వెనక్కి తగ్గాలని కేసీఆర్ అనుకున్న టైంలో ఆయనను లేపి ముందుకు నడిపించింది కాంగ్రెస్ నేతలేనని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన జరగాలని తమ పార్టీ నేతలే కేసీఆర్‌ను వెనకుండి నడిపించారని అన్నారు.
కాంగ్రెస్ నాయకత్వం అలా నడిపించకుంటే కేసీఆర్ దీక్ష కూడా చేసేవారు కాదన్నారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. తెలంగాణ ఇచ్చినప్పుడు దేవతైన సోనియా గాంధీ ఇప్పుడు డూప్లికేట్ అయ్యారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రజల్లో కాంగ్రెస్ ఎప్పుడూ హీరోనే అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మీరే విలన్ అని విమర్శించారు. రేవంత్ భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవట్లేదన్నారు. తనను రేవంత్ కడిగిపారేస్తారనే భయం కేసీఆర్‌లో ఉందన్నారు.