మునుగోడు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేయాలని, ఇక్కడ గెలిచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ ఇక దేశాన్ని దోచుకోవడానికి ఈ కొత్త పార్టీ స్థాపించారని ఆరోపించారు. గురువారం మునుగోడులోని తన క్యాంపు ఆఫీస్‌లో మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడిన తనను కేసీఆర్ అనేక సార్లు అవమానపరిచారని.. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ అన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేసిన టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఎన్నికల్లో మునుగోడు ప్రజలను ఓట్లు ఎట్ల అడుగుతదని ప్రశ్నించారు. ప్రజలను కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ ఎన్నిక వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్మును బీజేపీ కక్కిస్తుందని, ప్రజలు కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనకు ప్రజలు ముగింపు పలుకుతారన్నారు.
కేసీఆర్ అవినీతిలో నంబర్ 1 సీఎం: వివేక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన తన బిడ్డ కవితను తప్పించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ డ్రామా మొదలుపెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఉండేవారని.. ఆ తుగ్లక్ఆలోచనలన్నీ ఆయనకు వంటపట్టాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ పార్టీ కూడా రూ.100 కోట్లతో విమానం కొనలేదని, కానీ కేసీఆర్ కొన్నారంటే అది కేవలం అవినీతి సొమ్ముతోనే అన్నారు. తెలంగాణ సీఎం అవినీతిలో నంబర్ 1గా ఉన్నారన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్నాడనే భయంతో మండలానికి ఇద్దరు మంత్రులను పెట్టారని అన్నారు. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం కోసమే వచ్చినట్టైందన్నారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి వెంట ఉన్నారని, ఆయన గెలుపునకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మునుగోడులో బీజేపీకి ఉన్న ఆదరణ చూసిన కేసీఆర్.. అవినీతి సొమ్ము పంచి ఇక్కడ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ సొమ్మును తీసుకొని ధర్మం కోసం పోరాడే రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జక్కలవారిగూడెం సర్పంచ్ జక్కలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
మునుగోడు, మర్రిగూడ, చండూరు, నారాయణపురం మండలాలకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం బీజేపీలో చేరారు. రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీపీసీసీ అధికార ప్రతినిధి వట్టికొట్టి శేఖర్ ఉన్నారు. అలాగే చండూరు మండలంలోని బొదంగపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 100 మంది చేరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సాగర్ల లింగస్వామి యాదవ్, విజయ్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.