రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచారు: షర్మిల

నిజామాబాద్/బోధన్, వెలుగు: కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల డిమాండ్​ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు పెట్టి ఎమ్మెల్యేలు మాంసం, మందు పంచుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్​ షాపులను రద్దు చేస్తామన్నారు.

షర్మిల పాదయాత్ర ఆదివారం నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గంలోని సాలంపాడ్, పెంటకూర్దు, బోధన్​ పట్టణంలో సాగింది. పాదయాత్ర 181వ రోజు 2,600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సాలంపాడ్​లో వైఎస్ విగ్రహాన్ని షర్మిల అవిష్కరించారు. బోధన్​లోని అంబేద్కర్​ చౌరస్తాలో బహిరంగ సభలో మాట్లాడారు. తమ పాలనలో సమస్యలు లేవని టీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని, తనతో పాదయాత్ర చేసి సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి యాత్ర నిలిపేస్తానని సవాల్​ విసిరారు.

ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని, రైతు రుణమాఫీ నుంచి ఇంటికో ఉద్యోగం వరకు ప్రతి మాటా మోసమేనని ఫైర్​అయ్యారు. పాలన చేతకాని నాయకుడిని సాగనంపేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

జీతాలు రాక ఇబ్బందుల్లో కార్మికులు

బోధన్​లోని నిజాం దక్కర్​ షుగర్​ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారని, ఇన్ని రోజులైనా ఫ్యాక్టరీని ఎందుకు తెరవడం లేదని షర్మిల ప్రశ్నించారు. కార్మికులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, దీంతో 2 వేల కుటుంబాలు ఆర్థికంగా సతమవుతున్నాయని చెప్పారు. కార్మికులు తెలంగాణలో పుట్టలేదా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాడలేదా? అని నిలదీశారు. వెల్ఫేర్​ హాస్టళ్లలో పురుగుల అన్నం పెడుతున్నారని, అక్కడి వారికి ఓట్లు ఉండవని హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసమే వైఎస్సార్​టీపీ పార్టీని పెట్టామని, జనం పక్షాన కొట్లాడతామని, వైఎస్సార్​ సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం పోస్తామని షర్మిల హామీ ఇచ్చారు.