- కేకే, కడియం, పోచారం లాంటి వాళ్లనూ కాపాడుకోలేని పరిస్థితి
- ట్వీట్లకే పరిమితమవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కారు ఖాళీ అవుతుండడంతో క్యాడర్ తలోదారి
హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, ఇప్పుడు తన పార్టీ ఖాళీ అయితుంటే మౌనంగా ఉండిపోతున్నారు. కేకే, కడియం వంటి సీనియర్ నాయకులు లోక్‌సభ ఎన్నికలకు ముందే గుడ్ బై చెప్పగా, ఇప్పుడు మరో సీనియర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారం ఫిరాయింపుపై కేసీఆర్ ఇప్పటి వరకూ సప్పుడు చెయ్యలేదు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నాడు.
ఏకంగా ఆ పార్టీ ఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని, కేసీఆర్ పాలన నచ్చి పార్టీ మారుతున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చెప్పించారు. ఇప్పుడు అవ్వే కారణాలను బీఆర్‌ఎస్ వీడుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విని ఊరుకోవడం తప్పితే, కనీసం విమర్శలు చేసే అవకాశం కూడా కేసీఆర్‌కు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏది చేసినా, దానికి ఏదో ఓ కారణం చెబుతూ సమర్థించిన నాయకులే ఇప్పుడు చాటుగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తగ్గుతున్న బలం
అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెల్చుకున్న బీఆర్‌ఎస్, మొన్నటి కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో ఓడిపోయి 38కి తగ్గిపోయింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే హస్తం పార్టీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో కారు పార్టీ తిరిగి పుంజుకుంటుందని, ప్రజలంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నారని ఆ పార్టీ హైకమాండ్ చేసిన ప్రచారం ఫిరాయించాలనుకున్న ఎమ్మెల్యేలు సందేహంలో పడిపోయారు. ఎన్నికల తర్వాత చూద్దాం అన్నట్టుగా ఆగిపోయారు. లోక్‌సభలో పార్టీ ఏకంగా జీరోకు పడిపోవడంతో నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. పోచారం వంటి సీనియర్ నాయకుడే గులాబీ గూటికి బైబై చెప్పడం ఆ పార్టీకి ఒక్కసారికి బిగ్ షాకునిచ్చింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 34కు తగ్గింది. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ సైలెంట్‌గా ఉండగా, కేటీఆర్ ట్వీట్లతో సరిపెడుతున్నారు. ఎమ్మెల్యేల, ఇతర నేతలను కాపాడుకునే ప్రయత్నాలేవీ జరగకపోవడంతో కేడర్ కూడా తమ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నది.
పార్టీ విలీనమా?
కాంగ్రెస్ ఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకుని, రాష్ట్రంలో ఆ పార్టీని లేకుండా చేయాలని అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించారు. కానీ, కాంగ్రెస్ పుంజుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీయే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలినట్టు చీలుతుందనే ఆందోళనను బీఆర్‌ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది బయటకు వచ్చి, పార్టీ తమదేనంటూ ఈసీకి దరఖాస్తు చేస్తారన్న ప్రచారం జరుగు తున్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేల చేతిలోకి బీఆర్‌ఎస్ వచ్చాక.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.