
- జనగామ.. వజ్రపు తునక అయితది
- ఎక్కడ కరువొచ్చినా జనగామకు రానియ్యం
- ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
- ఉమ్మడి వరంగల్‌లో 12 సీట్లు గెలుస్తం
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
స్టేషన్ ఘన్ పూర్/పాలకుర్తి/జనగామ అర్బన్, వెలుగు : భవిష్యత్‌లో జనగామ వజ్రపు తునకలా మారుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లతో మల్లన్న సాగర్ నుంచి తపాస్‌పల్లికి లింక్ చేస్తున్నాం, అక్కడి నుంచి జనగామ జిల్లాలోని రిజర్వాయర్లకు నీళ్లిస్తామని ప్రకటించారు. దేవాదుల నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉండేలా గోదావరిపై సమ్మక్క బ్యారేజీని నిర్మించినట్లు చెప్పారు. ఎంత ఎండాకాలం అయినా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు.
ఎక్కడ కరువొచ్చినా జనగామకు రానియ్యమని, ఏడాది పొడవునా పంటలు పండించుకునేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, వరంగల్ మధ్యలో ఉన్న రెండు ప్రాంతాలను డెవలప్ చేయాలని భావించి జనగామ, భువనగిరిని జిల్లాలు చేసినట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లో జనగామ బాగా డెవలప్ అయితదని చెప్పారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పారు. నిత్యం తన వెంటే ఉండి అన్ని పనుల్లో భాగస్వామ్యం అవుతాడని, అందుకోసం ఆయనను గెలిపించాలని సూచించారు. చేర్యాలను నెల రోజుల్లోపు రెవెన్యూ డివిజన్ చేస్తామని, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు పంట కాల్వలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 సీట్లను బీఆర్‌ఎస్సే గెలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేస్తామని చెప్పారు. జనగామపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉందని అందుకే జిల్లా ప్రకటించారని, మెడికల్ కాలేజీ మంజూరు చేశారని చెప్పారు. ఒకప్పటి కరువు ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలం అయిందన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. విద్య, వైద్యం, సాగు వంటి రంగాల్లో జనగామ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందన్నారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరడం మంచి పరిణామమన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని చెప్పారు.
తెలంగాణ అంటేనే కేసీఆర్
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని ఆర్టీసీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలన కారణంగానే తెలంగాణ ఫస్ట్‌ప్లేస్‌లో నిలించిందని చెప్పారు. జనగామ అన్ని రంగాల్లో డెవలప్ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పల్లాను గెలిపించాలని కోరారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన గాడిపెల్లి ప్రేమలతారెడ్డి
బీజేపీ సీనియర్ లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి సోమవారం జనగామలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే బీజేపీ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్ డాక్టర్ రాజమౌళి, ధర్మపురి శ్రీనివాస్ తదితరులు సైతం గులాబీ కండువా కప్పుకున్నారు.
సీఎం మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన జనం
జనగామలో జరిగిన బహిరంగ సభలో ఓ వైపు సీఎం కేసీఆర్మాట్లాడుతుండగానే జనం నెమ్మదిగా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం అవుతుందంటూ 12 గంటల నుంచే జనాలను తరలించారు. కానీ సీఎం కేసీఆర్ రెండు గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ లేట్‌గా స్టార్ట్ కావడంతో సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగానే ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
లీడర్ల ముందస్తు అరెస్ట్
సీఎం కేసీఆర్ టూర్‌ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప, కర్నల్ మాచర్ల భిక్షపతి, కొంతం శ్రీనివాస్, శివరాజ్‌యాదవ్, సందీప్‌ను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా దశమంతరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతున్న బీజేపీ లీడర్లు, కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు. అలాగే సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, జిల్లా కమిటీ సభ్యడు బూడిద గోపి, సుంచు విజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.