పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పెద్ద హోదాలో ఉంటారు: కేసీఆర్

పిడికెడు మందితో  తెలంగాణ ఉద్యమం ప్రారంభించానని... చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించానని కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, అక్టోబర్ 30వ తేదీ సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెేసీఆర్ పాల్గొని  ప్రసంగించారు. కాంగ్రెస్.. అతికష్టం మీద, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని, సాధించుకున్న తెలంగాణలో ప్రారంభంలో ఎన్నో కష్టాలు  ఎదుర్కొని... కరెంట్, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించామని కేసీఆర్ చెప్పారు. 

తెలంగాణలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల వలే కలిసి ఉంటారు. కొందరు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా.. తెలంగాణలో సాధ్యం కాలేదన్నారు. ముస్లింల కోసం కూడా ప్రత్యేక గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి  జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధించామన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పెద్ద హోదాలో ఉంటారని కేసీఆర్ తెలిపారు.