ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ వస్తయి.. పోతయి.. ఎవరో ఒకరు గెలుస్తరు.. కానీ, అభ్యర్థి చరిత్రతోపాటు వారి పార్టీ చరిత్ర కూడా తెలుసుకుని ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ధర్మపురిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ధర్మపురిలో గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. దేశ ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పూర్తిగా రాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న వజ్రాయుదం ఓటు అని, ఏమరుపాటుగా ఓటు వేస్తే.. మన భవిష్యత్ ఆగమైతదని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుందని.. ఒక్క అవకాశం కాదు.. 11 సార్లు అవకాశం ఇచ్చామని... 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
ALSO READ :- ట్రాక్ ఎక్కిన అమర్ గేమ్.. గెలిచి సత్తా చాటాడు.. పొగడ్తలతో ముంచెత్తిన శివాజీ
ప్రధాని మోదీకి ప్రవేటు పిచ్చి పట్టిందని... ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేశారని విమర్శించారు.ఇప్పడు.. సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పొలాల వద్ద మోటారుకు మీటర్ పెట్టాలని తనపై కేంద్రం ఒత్తిడి చేసిందని కేసీఆర్ ఆరోపించారు. కానీ తాను.. చచ్చినా పొలాల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పానన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం మనకు ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు.