- సిరిసిల్లలో రాజుకున్న కుల రాజకీయం
- బీఆర్ఎస్కు కులసంఘాల ఏకపక్ష మద్దతుపై నేతల ఫైర్
- సపోర్టు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- తాము మద్దతు తెలపడం లేదని వెల్లడి
- రాజకీయ నేతల వద్ద కులాన్ని తాకట్టు పెడతారా అని మండిపాటు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సాక్షిగా సిరిసిల్లలో కేటీఆర్ ను గెలిపిస్తామని వివిధ కుల సంఘాలకు చెందిన కొందరు నాయకులు తీర్మానపత్రాలను సమర్పించారు. వేదిక మీద తీర్మానపత్రాలను చూపుతూ కేటీఆర్ కు మద్దతు తెలుపుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే, కేటీఆర్ కు మద్దతు తెలపడంపై ఆయా కుల సంఘాల్లోని ఇతర నాయకులు అభ్యంతరం తెలిపారు. బుధవారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో పద్మశాలీ, మున్నూరుకాపు, మైనారిటీ సంఘాల లీడర్లు మీడియా సమావేశం నిర్వహించారు.
పద్మశాలీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోనె ఎల్లప్ప, సంఘం జనరల్ సెక్రటరీ కామిని నళిని, వైస్ ప్రెసిడెంట్ కొండా ప్రతాప్ మాట్లాడుతూ కేటీఆర్ కు తాము మద్దతు తెలపడం లేదని ప్రకటించారు. పద్మశాలీ సంఘం జిల్లా సంఘం అధ్యక్షుడు గాజుల బాలయ్య, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు పూర్ణచందర్, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండల సత్యం.. కేటీఆర్ కు సపోర్టు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. కొంతమంది కుల సంఘాల నాయకులు కేసీఆర్, కేటీఆర్ కు తొత్తులుగా మారి వ్యక్తిగత ప్రయోజనం కోసం మద్దతు తెలిపారని మండిపడ్డారు.
కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ ఇచ్చిన తీర్మానపత్రాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పద్మశాలీ సంఘం మద్దతు తెలపాలంటే ముందుగా గ్రామ, వార్డు, మండల, పట్టణ పద్మశాలీ సంఘాలతో మీటింగ్ పెట్టాలని, ఏకపక్షంగా మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జిల్లా నాయకత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే పద్మశాలీల మధ్య ఐక్యత దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు వ్యక్తిగతంగా మద్దతు తెలుపుకోవచ్చు తప్ప కులాన్ని తాకట్టు పెట్టకూడదని సూచించారు.
అంజి రెడ్డి ప్రకటన చెల్లదు
రెడ్డి సంఘం జిల్లా ప్రెసిడెంట్ కూర అంజి రెడ్డి, కేటీఆర్ కు మద్దతు తెలపడంపై ఆ సంఘం లీడర్లు ఫైరయ్యారు. బుధవారం సిరిసిల్లలో రెడ్డి సంఘం నాయకులు జిల్లా రెడ్డి సంఘం భవనంలో సమావేశం అయ్యారు. దాదాపు వంద మంది రెడ్డి సంఘం సభ్యులు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ భేటీలో పాల్గొన్నారు. కేటీఆర్ కు తాము మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు. కూర అంజిరెడ్డి పదవీకాలం మంగళవారం నాటికే ముగిసిందని, ఆయన చేసిన ప్రకటన చెల్లదని పేర్కొన్నారు. రెడ్డి సంఘం నాయకులు కనిమెని చక్రధర్ రెడ్డి, మల్లారెడ్డి, ఇతర నాయకులు కేటీఆర్ కు మద్దతు తెలపడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
సపోర్టు వెనక్కి తీసుకోవాలి
ముస్లింల మద్దతు కేటీఆర్ కే అని మైనారిటీ సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం ప్రకటించగా ఆయన ప్రకటన చెల్లదని, తమను సంప్రదించనిదే ఎలా సపోర్టు చేస్తారని మైనారిటీ సంఘం నాయకులు ఎస్ కే గౌస్, రియాజ్ ప్రశ్నించారు. అలాగే మున్నూరుకాపు సంఘం నాయకులు దుమాల శ్రీకాంత్.. కేటీఆర్ కు మద్దతు తెలిపారని, ఇది కూడా చెల్లదని మున్నూరుకాపు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, శీలం రాజు అన్నారు. జిల్లాలో ఉన్న మున్నూరుకాపు నాయకులను సంప్రదించకుండానే మంత్రికి మద్దతు ప్రకటించడం సరికాదన్నారు.
కేటీఆర్ కు శ్రీకాంత్ ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కులాన్ని మొత్తం రాజకీయ నేతలకు తాకట్టు పెట్టడం ఏంటని ఫైరయ్యారు. మున్నూరుకాపుల ఐక్య కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. గతంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసినప్పుడు మున్నూరుకాపు సంఘ సభ్యులను ధర్నాలకు వాడుకున్నారని తెలిపారు.