
- సభకు పెట్టిన వందల కోట్లు ఎట్లొచ్చినయ్..
- అవన్నీ కాళేశ్వరం, స్కీముల పేరుతో చేసిన స్కాముల డబ్బులే..
- కేసీఆర్ స్పీచ్‌లో పసలేదు.. తాగొచ్చి ఏదేదో మాట్లాడిపోయిండు
- ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కడియం, నాగరాజు, రేవూరి
వరంగల్, వెలుగు: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం ఐదారు వందల కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లీడర్లు ప్రశ్నించారు. అవన్నీ కాళేశ్వరం అవినీతి, స్కీముల్లో చేసిన స్కామ్‌ల డబ్బులేనని ఆరోపించారు. గ్రేటర్ వరంగల్‌లోని కాంగ్రెస్ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్‍రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పుకోవడానికే ఎల్కతుర్తిలో మీటింగ్ నిర్వహించారన్నారు. కేంద్రం సీఆర్‌పీఎఫ్ బలగాలను మావోయిస్టుల వద్దకు కాకుండా కేసీఆర్ ఫాంహౌస్‌కు పంపితే.. అక్కడ దొరికే డబ్బుతో తెలంగాణ అప్పు తీరుతుందన్నారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదని.. తాగొచ్చి నోటికి ఏది వస్తే అది మాట్లాడి వెళ్లారన్నారు.
సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు, కేసీఆర్ కుటుంబమంతా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కినప్పుడు తను ఏ గాంధీనో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ జయశంకర్ కృషితోనే ఉద్యమానికి ఊపిరి పోశామని చెప్పిన కేసీఆర్.. 25 ఏండ్ల బీఆర్‌ఎస్ సభలో జయశంకర్ ఫొటో ఎందుకు పెట్టలేదన్నారు.
జైళ్లు, కేసులు ఆఫీసర్లకు.. ఆస్తులు కేసీఆర్‍కు..
కేసీఆర్ ప్రభుత్వ హయంలో సాగు నీటి ప్రాజెక్ట్‌లు, స్కీముల్లో అవినీతికి సహకరించిన అప్పటి ఐఏఎస్, ఐపీఎస్‍లు విదేశాల్లో, జైల్లో, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం ఆస్తులు వెనకేసుకుందని ఎమ్మెల్యే కడియం ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో చేయని పనులు కాంగ్రెస్ 16 నెలల్లోనే చేస్తే భరించలేక.. కేసీఆర్ సోషల్ మీడియా, పేపర్, ఛానల్ లో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, నేతలు మార్నేని రవీందర్‍రావు పాల్గొన్నారు.