కాంగ్రెస్​ మాటలు నమ్మితే గోల్​మాల్​ ఐతరు : కేసీఆర్​

  •     ఇగ నేను చేసేదేమీ ఉండదు.. మస్తుగ కొట్లాడిన.. మీరే కొట్లాడాలె: కేసీఆర్​
  •     కాంగ్రెసోళ్లు గొడ్డలితో రెడీ ఉన్నరు
  •     రైతుబంధు, 24 గంటల కరెంటు, ధరణి తీసేస్తరట
  •     వాళ్లొస్తే దళారుల రాజ్యమొస్తది
  •     కాంగ్రెస్​, బీజేపీకి బాసులు ఢిల్లీల ఉంటరు.. మా బాసులు ప్రజలే
  •     బీసీలకు రానికాడ టికెట్​ రాకపాయె.. వచ్చిన కాడ చైతన్యం ఏమైతున్నట్లు?
  •     ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు

పెద్దపల్లి, వెలుగు : కాంగ్రెస్​ మాటలు నమ్మితే గోల్​మాల్​ అవుతారని, ఆ తర్వాత తాను చేసేది ఏమీ ఉండదని బీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​ ఆన్నారు. ‘‘కాంగ్రెస్​ పార్టీ గొడ్డలి భుజాన పెట్టుకొని రెడీగా ఉన్నది. వారు గిట్ల వచ్చిన్రంటే రైతుబంధుకు రాంరాం అంటరు. తియ్యగ పుల్లగ చెప్పే మాటలను నమ్మితే గోల్​మాల్​ ఐతరు. తర్వాత నేను జెయ్యగలిగేది ఏమీ ఉండదు. నేను మస్తుగ కొట్లాడిన. 24 ఏండ్లు కొట్లాడిన. ఇగ మీరే కొట్లాడాలె” అని పేర్కొన్నారు. 

మందమర్రి, మంథని, పెద్దపల్లిలో మంగళవారం నిర్వహించిన సభల్లో కేసీఆర్​ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్​ పార్టీ  రైతుబంధు, 24 గంటల కరెంటు, ధరణి పోర్టల్​ వద్దంటున్నది. కాంగ్రెస్​ వస్తే స్కీములన్నీ కట్​ ఐతయ్​. కాంగ్రెస్​తో పాటే  తెలంగాణలో దళారులు, పైరవీల రాజ్యం కూడా వస్తది” అని అన్నారు. 

కరెంట్​, రైతుబంధు వద్దట..

‘‘కేసీఆర్​కు ఏం పనిలేదు.. రైతులకు రైతుబంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తున్నడు.. అ ఉత్తమ్​కుమార్​రెడ్డి అంటున్నడు..  కేసీఆర్​ కరెంటును దుబారా చేస్తున్నాడని, రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే సాలని రేవంత్​రెడ్డి అంటున్నడు.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని మరో నాయకుడంటున్నడు.. 3 గంటల కరెంటు కావాలా, 24 గంటలు కావాలో  తేల్చుకోవాలి..’’ అని కేసీఆర్ తెలిపారు. మూడేండ్లు కష్ట పడి ధరణి తీసుకొచ్చామని చెప్పారు. ఫ్రీ కరెంట్​నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో కూడా లేదని అన్నారు.

రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే, రానున్న రోజుల్లో 4 కోట్ల టన్నులకు చేరుకుంటందని తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్​ కాలేజీని కూడా ఇయ్యలేదని, అయినా ప్రతి జిల్లాకు మెడికల్​ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ‘‘కాంగ్రెస్​, బీజేపీకి బాసులు ఢిల్లీల ఉంటరు. మా బాసులు తెలంగాణ ప్రజలే’’ అని ఆయన అన్నారు. 

ప్రజాస్వామ్య పరిణతి పెరగాలి

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటినా దేశంలోని ప్రజలకు  ప్రజాస్వామ్య పరిణతి లేదని, ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయని కేసీఆర్​ పేర్కొన్నారు. మన తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన చైనా ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. మంథనిలో బీసీ నాయకుడు పుట్ట మధుకర్​కు అవకాశం ఇచ్చామని,  బీసీ , ఎస్సీ, ఎస్టీలందరూ చర్చించుకొని ఆయనకు సహకరించి గెలిపించుకోవాలని అన్నారు. 


‘‘బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదని పేపర్లలో, టీవీలల్లో మనం వింటున్నం. రానికాడ టికెట్​ రాకపాయె..  వచ్చిన కాడ మన చైతన్యం ఏమైతున్నట్లు? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. వచ్చినప్పుడు మన ఐక్యత ఎందుకు లోపిస్తున్నది. మీ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో చూపెట్టాలె” అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే  మంథని నియోజకవర్గాన్ని వెయ్యికోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లిలో ప్రజలకు సేవ చేస్తున్న దాసరి మనోహర్​రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అటు మందమర్రిలో మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా పెర్క్ టాక్స్ ను యాజమాన్యం నుంచి రీ యింబర్స్​చేసేలా, మందమర్రిలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ ను రిటైర్డ్ కార్మికులకు కేటాయించేలా చూస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చారు.

ఈ పదేండ్లలోనే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది

కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 50 ఏండ్లు పాలించింది కానీ ఏనాడూ ప్రజలకు కావాల్సిన మౌలిక విషయాలను పట్టించుకోలేదని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ పాలనలో వలసలు, నిరసనలు, రక్తపాతాలు, చావులు చూసినం. కర్ఫ్యూలు, కష్టాలే ఉండేవి. గత వందేండ్ల చరిత్రలో ఈ పదేండ్లలోనే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది’’ అని అన్నారు. 1956లో తెలంగాణను పొడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ తర్వాత ఏడుగురు విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర దానికున్నదని మండిపడ్డారు.

నాడు టీఆర్ఎస్​తో పొత్తులు పెట్టుకొని గెలిచినా కాంగ్రెస్​ తెలంగాణ ఇయ్యలేదని,  కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కొట్లాడితే అప్పుడు తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పాలనలో లోన్లు, పన్నులు  చెల్లించకపోతే తలుపులు గుంజుకపోయేటోళ్లని ఆయన అన్నారు.