- పోలీసులు, ఇంటెలిజెన్స్‌తో పాటు టీఆర్ఎస్ తరఫున నిఘా
- స్థానిక లీడర్లను నమ్మని పరిస్థితి..
- పక్క జిల్లాల నేతలకే టీమ్‌లో బాధ్యతలు
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. విజయం కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని సమాచారాన్ని పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నది. ఈ క్రమంలో నల్గొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన ప్రత్యేక పోలీస్ నిఘా బృందాలు గ్రామాలను జల్లెడ పడ్తున్నాయి. వీరిలోనూ కోవర్టులు ఉండవచ్చని అనుమానిస్తున్న టీఆర్ఎస్ హైకమాండ్.. పార్టీ తరఫున నిఘా టీమ్‌లను రంగంలోకి దింపింది. కేసీఆర్ స్క్వాడ్ గా భావిస్తున్న ఈ టీమ్‌లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో ఎవరెవరు పార్టీ మారారు..? కొత్తగా ఎంత మంది పార్టీలో చేరారు..? పార్టీలో చేరినవారిలో ఎవరైనా కోవర్టులు ఉన్నారా? ప్రత్యర్థి పార్టీల లీడర్ల నుంచి ఎవరెవరికి ఫోన్లు వస్తున్నాయి? ఎవరు ఎవరితో టచ్‌లో ఉంటున్నారు? లాంటి వివరాలు రాబడుతున్నాయి.
నల్గొండ, వెలుగు : మునుగోడులో ప్రత్యర్థులతోపాటు, సొంత పార్టీలోని అసంతృప్త నేతల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి, ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు టీఆర్ఎస్ హైకమాండ్ సీక్రెట్ఆపరేషన్ చేపడుతున్నది. పార్టీ లీడర్లతో ‘కేసీఆర్స్క్వాడ్’ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోకి వదిలింది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్ లాంటి జిల్లాల నుంచి చురుకైన నేతలకు ఈ బాధ్యతలు అప్పగించి.. స్మార్ట్ఫోన్లు ఇచ్చి.. ఊర్లల్లో చక్కర్లు కొట్టిస్తున్నది. వారం రోజులుగా సర్వే పేరుతో గ్రామాలను చుట్టివస్తున్న ఈ నిఘా టీమ్ లు.. ప్రత్యర్థులు, స్థానిక టీఆర్ఎస్ నేతల కార్యకలాపాలపై హైకమాండ్‌కు సమాచారం చేరవేస్తున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జులుగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు బాధ్యతలు చూస్తున్నప్పటికీ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నది.
వలసలు ఆపడమే లక్ష్యంగా..!
సర్వే పేరుతో స్మార్ట్ఫోన్లు పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ స్క్వాడ్ ప్రధాన లక్ష్యం వలసలకు అడ్డుకట్టవేయడమేనని స్థానిక టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్దసంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నేతలు క్యూ కడ్తున్నారనే అంచనాకు టీఆర్ఎస్ హైకమాండ్ వచ్చింది. ఈ వలసలను వీలైనంత కంట్రోల్ చేయకపోతే ఓటమి ఖాయమని భావించి.. నేతల కదలికలను పసిగట్టి వలసలను ఆపేందుకు సొంత సైన్యాన్ని వాడుతున్నట్లు సమాచారం. అయితే స్థానికంగా ఉన్న లీడర్లు ఎప్పుడు బీజేపీలోకి దూకుతారో తెలియని పరిస్థితి ఉండడం వల్లే ఈ టీమ్‌లలో లోకల్ లీడర్లకు అవకాశం ఇవ్వలేదని తెలిసింది. మరోవైపు బైపోల్ హడావుడి మొదలైనప్పటి నుంచి అసంతృప్తి గళం వినిపిస్తున్న బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్‌ను టీఆర్ఎస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా పక్కనపెడ్తున్నట్లు తెలిసింది. వాళ్ల గురించి పార్టీలో చర్చ కూడా రానివ్వడం లేదు. గౌడ సామాజిక వర్గాల లీడర్లతో నిర్వహించే సమావేశాలకు కూడా బూర నర్సయ్య గౌడ్‌కు ఆహ్వానం ఉండడం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వీళ్లిద్దరినీ తిరిగి ప్రచారంలోకి దింపితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించే, దూరంగానే పెడుతున్నట్లు సమాచారం. మూడురోజుల కిందట్నే అభ్యర్థిని కూడా ప్రకటించడంతో వలసలు మరింత ఉధృతంగా ఉండొచ్చని అంచనా వేసుకున్న టీఆర్ఎస్ హైకమాండ్ ఆ మేరకు అసంతృప్తులపైనా నిఘా పెట్టింది. వీరితోపాటు మునుగోడు, చౌటుప్పల్, నాంపల్లి, నారాయాణ్ పూర్లో పార్టీ మారుతారనే అనుమానం ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మన్సిపల్ చైర్పర్సన్ల కదలికల పైనా కేసీఆర్ స్క్వాడ్ దృష్టిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.