కేసీఆర్ టార్గెట్ బహుజన నేతలే

నాడు ఆలె నరేంద్ర, చెరుకు సుధాకర్, విజయశాంతి.. మొన్న సీఐ దాసరి భూమయ్య, తాటికొండ రాజయ్య, కొండా మురళి.. నిన్న కడియం శ్రీహరి, గటిక విజయ్.. నేడు ఈటల రాజేందర్.. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన బహుజన నాయకులను సీఎం కేసీఆర్​ టార్గెట్​ చేసి తొలగిస్తూ వస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకులను, ఉద్యమం చేస్తున్న వారిని ఉరికిచ్చి కొడతానన్న వాళ్లను పార్టీలో చేర్చుకొని.. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బహుజన నాయకులు ఒక్కొక్కరినీ రాజకీయంగా సమాధి చేసుకుంటూ వస్తున్నారు. పట్టుమని 0.5 శాతం కూడా లేని సామాజిక వర్గం 93 శాతం ఉన్న దళిత, బహుజనులపై ఆధిపత్యం చలాయిస్తోందంటే దానికి కారణం బహుజనుల్లో చైతన్యం, ఐకమత్యం లేకపోవడమే. బహుజన వర్గాలు బానిసత్వంలో ఉన్నంత కాలం ఆధిపత్య వర్గాల నాయకులు అణచివేస్తూనే ఉంటారని ఇప్పటికైనా బహుజన నాయకత్వం గుర్తించాలి. కేసీఆర్​ కుటిల రాజకీయాలను తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది.

కొడుకు కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేయడానికే బహుజన నేతలను కేసీఆర్​ టీఆర్​ఎస్​ పార్టీ నుంచి తప్పిస్తూ వస్తున్నారు. దళితుడిని సీఎం చేస్తానని తొలి దఫా గద్దెనెక్కిన కేసీఆర్.. దళిత నాయకుడు తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంను చేసి చేతులు దులుపుకున్నారు. రాజయ్య ఎదుగుదలను ఓర్వలేక పదవి నుండి తొలగించారు. రాజయ్య తొలగింపుపై దళిత, బహుజన సంఘాలు ఆందోళన చేయడంతో ఎంపీగా ఉన్న మరో దళిత నాయకుడు కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కేసీఆర్ తనను తాను రక్షించుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయాలని.. అందుకు అడ్డుగా ఉండే సీనియర్లను డమ్మీలను చేశారు. హరీశ్​ రావు లాంటి సీనియర్లకు కూడా తొలుత మంత్రి పదవులు ఇవ్వలేదు. అదే సమయంలో కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి పార్టీ శ్రేణులకు కేటీఆర్ ను కేంద్రంగా చేశారు. మంత్రి పదవులను భర్తీ చేసి పాలనను గాడిలో పెట్టాలని వచ్చిన ఒత్తిడితో చాలా కాలానికి మంత్రి పదవులు నింపాడు. అయితే ప్రతి పేషీలో ఆయన కోటరీకి చెందిన రిటైర్డ్ అధికారులను ఓఎస్డీగా నియమించి తనకు తెలియకుండా ఏ నిర్ణయాలూ చేయరాదని ఆదేశాలిచ్చి మంత్రులను డమ్మీలుగా మార్చారు.
ఉద్యమ సమయం నుంచి కుట్రలే
ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఅర్ ను పరిశీలిస్తే ఆయన ఎంతటి కుట్రదారుడో అర్థమవుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ఏర్పడాలని, ఆ తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడాలని.. ఆ దిశగా రెండు ఏక కాలంలో రెండు ఉద్యమాలు చేయాలన్న మారోజు వీరన్న.. ప్రొఫెసర్ జయశంకర్, వి.ప్రకాశ్, డాక్టర్​ చెరుకు సుధాకర్ నాయకత్వంలో సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పెట్టించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వణుకు పుట్టించాడు. దాంతో భయపడిన అప్పటి సీఎం చంద్రబాబు వీరన్నను బూటకపు ఎన్​కౌంటర్ లో కాల్చి చంపారు. ఆ క్రమంలో ఉద్యమాన్ని బతికించాలని తపనపడిన జయశంకర్, వి.ప్రకాశ్, చెరుకు సుధాకర్.. కేసీఆర్​కు ఎన్నో రకాలుగా వివరించి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. అవసరాలు తీరేదాకా నాయకులను వాడుకోవడం తర్వాత వారిని తొలగించడం కేసీఆర్​కు పరిపాటయింది.
సంఘాలను చీల్చే ప్రయత్నాలు
నాయకులనే కాదు బహుజన సంఘాలను చీల్చిన కేసీఆర్.. చీలికదారులకు పదవులిచ్చి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. ముదిరాజ్ సంఘాన్ని చీల్చి ఆ నాయకుడిని రాజ్యసభ సభ్యునిగా చేశారు. ఎంఆర్పీఎస్​లో కీలక నాయకున్ని తనవైపు తిప్పుకుని ప్రభుత్వ ప్లీడర్ గా పదవి ఇచ్చారు. పార్టీ మొదటి రోజుల్లో వెంట నడిచిన గాదె ఇన్నయ్య, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ లాంటి వాళ్లను ఎందిరినో రాజకీయ సమాధి చేశారు. కులాలకు కుల సంఘ భవనాల ఆశ చూపి, కొందరికి గొర్రెలు, మరికొందరికి బర్రెలు, వలలు, ఇస్త్రీ పెట్టెలు, చాకలి, మంగలి వాళ్లకు ఉచిత కరెంటు అంటూ ప్రలోభ రాజకీయాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు బహుజనులకు.. సకల సంపదలు ఆధిపత్య కులాల వాళ్లకు అన్న చందంగా పాలన సాగిస్తున్నారు. కేబినెట్​ కూర్పులో వెలమ, రెడ్లకే ప్రాధాన్యతనివ్వడమే కాక.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్​ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ లాంటి కీలక పదవులన్నీ ఆధిపత్య కులాల వారికే కట్టబెట్టారు. 
ఈటలతో ఎప్పటికైనా ప్రమాదం తప్పదనే..
విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో కొనసాగిన క్రమశిక్షణ, తెగువ కలిగిన ఈటల రాజేందర్ అంతర్గతంగా ఎంత ఒత్తిడి ఉన్నా పార్టీని బహిరంగంగా విమర్శించలేదు. పార్టీని తిట్టి దుమ్మెత్తి పోసిన నాయకులు.. పార్టీలో చేరి మాట్లాడుతున్న సమయంలో కూడా సహనం కోల్పోకుండా సమాధానం చెపుతూ వచ్చారు. కరోనా వల్ల ఏడాది కాలంగా రాష్ట్రంలో ప్రజారోగ్యం అల్లకల్లోలం అవుతున్న స్థితిలో ఎంతో ఒత్తిడితో ఆరోగ్య శాఖను నిర్వహిస్తూ వచ్చారు. వైద్య శాఖలో నియామాకాలు జరిగితే ఈటలకు ప్రాముఖ్యత పెరుగుతుందనే సీఎం.. నియామకాలకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ వైద్యం మెరుగుపడితే తన బంధుమిత్రుల ఆస్పత్రుల్లో గిరాకీ తగ్గుతుందని కూడా నియామకాల భర్తీ చేపట్టలేదు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆదేశాలు తెచ్చినా వాటి అమలుకు కేసీఆర్​ నుంచి అనుమతి రాలేదు. ఈటలతో ఏనాటికైనా ప్రమాదమేనని, ఈటల లాంటి సీనియర్లు ఉండగా కేటీఆర్ ను సీఎం చేయలేననే ఆయనను కేబినెట్​ నుంచి పార్టీ నుంచి తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు.
అంతా సినిమా స్క్రిప్ట్​లా..
కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్న తరుణంలో హెల్త్​ మినిస్టర్​గా అంకితభావంతో రాష్ట్రమంతటా పర్యటిస్తూ పర్యవేక్షణ చేస్తున్న ఈటలపై వేటుకు సిద్ధం కావడం మంచి పరిణామం కాదు. నిజంగా ఈటల అక్రమాలకు పాల్పడితే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా సినిమా స్క్రిప్ట్ లాగా రైతులు కేసీఆర్ కు ఫిర్యాదు చేయడం, వెంటనే విచారణకు ఆదేశాలివ్వడం, తెల్లవారకముందే ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు శాఖలు ఆరోపణలు వచ్చిన గ్రామాలను దిగ్బంధం చేయడం చూస్తే ఇదంతా ఎంతటి కుట్రనో అర్థమవుతోంది. తెలంగాణకు అడ్డుపడిన నాయకులే నేడు ప్రభుత్వంలో భాగమై ప్రగల్భాలు పలుకుతుంటే ఎంతో బాధపడిన ఈటల.. టీఆర్ఎస్​ పార్టీకి పట్టాదారులం మేమేనని మాట్లాడడం జీర్ణించుకోలేని ఆధిపత్య వర్గాలు ఎలాగైనా ఆయనను తప్పించాలని కుట్రపన్నినట్లు తెలుస్తోంది. ఇది కుట్ర కాబట్టే సాగర్ ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు మిన్నకుండి ఎలక్షన్ ముగిసిన గంటకే తప్పుడు ప్రచారం చేయడం ఎంతటి పగడ్బందీ కుట్రనో బహుజనులు, ప్రజాస్వామికవాదులు తెలుసుకోవాలి.
ఉద్యమించాల్సిన సమయం వచ్చింది
కేసీఆర్​ కుట్రలను బహుజన ప్రజలు అవగాహన చేసుకుని ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. శ్రమను నమ్ముకొని, ఉత్పత్తి లో కీలకమైన బహుజనులను ఆ శ్రమలోనే ఉంచాలని చూసే దొర రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలను బహుజనులు అంతం చేసే రోజు వచ్చిందని గుర్తించాలి. దొరల దుర్మార్గాలను అంతం చేయడం కోసం ఇప్పటికైనా బహుజనులు ఏకం కావాలి. బహుజన ఆత్మగౌరవమే ఎజెండాగా బహుజనులు ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. బహుజనులు ఆత్మగౌరవం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది. ఎంతోమంది బహుజన నాయకులను వాడుకొని రాజకీయ సమాధి చేసిన దొరను బహుజన ప్రజలు రాజకీయ సమాధి చేయాలి. 

ప్రజల దృష్టిని మళ్లించడానికే
పాలకులు పాలన సక్రమంగా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు చేస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే.. పేషెంట్లకు కావాల్సిన ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందులు, ఆస్పత్రుల్లో పడకలు ఏర్పాటు చేయడంలో అలసత్వం చూపిస్తున్న దొర ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికే ఈటల అంశాన్ని ఎత్తుకుంది. కరోనా నియంత్రణకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించినా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా చలనం లేని దొర ఈటల అంశంపై మాత్రం ఆగమేఘాల మీద ఆర్భాటంగా విచారణ చేస్తున్నాడంటే ప్రజల దృష్టిని మరల్చడానికేనని అర్థం చేసుకోవాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బహుజన ఉద్యమ నాయకత్వం ఈటలకు అండగా ఉండడమే కాకుండా ఆయన పార్టీ నుంచి బయటకు వస్తే ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగాలి.

వాడుకుని వదిలేయడమే..
ఉద్యమంలోకి కేసీఆర్ ను తీసుకురావడంలో, ఉద్యమం జరిగినంత కాలం కీలకపాత్ర వహించిన వి.ప్రకాశ్​కు ఇప్పుడు ఎలాంటి ప్రాముఖ్యతా కల్పించడం లేదు. మారోజు వీరన్న అనుచరుడు చెరుకు సుధాకర్ ను కూడా వాడుకుని వదిలేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి ఏడాది పాటు జైల్లో ఉన్న సుధాకర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోగా పార్టీ నుంచి బయటకు పోయేలా చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని బహిరంగ వేదికలపై కాళ్లు మొక్కిన కేసీఆర్.. లోలోపల ఆయన గురించి ఎంతో చులకనగా మాట్లాడి అవమానించారు. బహుజన నాయకుడు టైగర్ ఆలె నరేంద్రను సెంటిమెంట్ తో పార్టీలోకి ఆహ్వానించి వాడుకుని వొదిలేశారు. విజయశాంతితో రాయబారం నడిపి తమ పార్టీలోకి వస్తే బలం పెరుగుతుందని నమ్మబలికి తల్లి తెలంగాణ పార్టీని లేకుండా చేసి తర్వాత ఆమెకు పొమ్మనకుండా పొగబెట్టిన ఘనుడు కేసీఆర్. సేవా దృక్పథంతో ఉద్యోగం చేస్తూ ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన సీఐ దాసరి భూమయ్య.. రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తాడనే భయంతో అక్రమంగా ఏసీబీ కేసులో ఇరికించారు. వరంగల్ పట్టణంలో పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కొండా మురళి దంపతులను బతిమిలాడి తీసుకొని పార్టీ అధికారంలోకి రావడానికి వాడుకున్నారు. మీడియా రంగంలో ఎంతో అనుభవం కలిగి ఉద్యమానికి ఎంతో మేలు చేసిన బహుజన జర్నలిస్ట్ గటిక విజయ్ ను పీఆర్వోగా వాడుకుని మధ్యలో వొదిలేశారు. ఇప్పుడు బహుజన నాయకుడు ఈటల రాజేందర్ ను తొలిగించే కుట్ర మొదలుపెట్టారు కేసీఆర్.-సాయిని నరేందర్, సామాజిక విశ్లేషకుడు,